Karthika Deepam Shourya | రీల్ లైఫ్ ‘శౌర్య’ రియల్ లైఫ్ టాపర్.. చదువులోనూ అదరగొట్టిన కార్తీక దీపం ఫేం బేబీ కృతిక!

Karthika Deepam Shourya | తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వచ్చాయి, వెళ్లాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన సీరియల్స్‌లో ఒకటి ‘కార్తీక దీపం’. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సీరియల్‌లో ప్రతి పాత్రకూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 15, 2026 11:30 AM IST
Karthika Deepam Shourya | రీల్ లైఫ్ ‘శౌర్య’ రియల్ లైఫ్ టాపర్.. చదువులోనూ అదరగొట్టిన కార్తీక దీపం ఫేం బేబీ కృతిక!

Karthika Deepam Shourya | తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వచ్చాయి, వెళ్లాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన సీరియల్స్‌లో ఒకటి ‘కార్తీక దీపం’. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సీరియల్‌లో ప్రతి పాత్రకూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. డాక్టర్ బాబు, వంటలక్క, దీప, హిమ వంటి పాత్రలతో పాటు ‘శౌర్య’ అనే చిన్నారి పాత్ర కూడా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.

ఈ ‘శౌర్య’ పాత్రలో నటించిన బేబీ కృతిక తన అమాయకమైన నటనతో, చురుకైన మాటలతో తెలుగు ఇంటింటికీ చేరింది. ‘రౌడీ’ అనే ట్యాగ్‌తో అభిమానులను అలరించిన ఈ చిన్నారి, తన సహజమైన అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. సీరియల్ ముగిసిన తర్వాత కూడా ఆమెకు మంచి గుర్తింపు కొనసాగింది.

ఇంట‌ర్ ఫ‌లితాల్లో అదుర్స్..

అయితే, ఇప్పుడు బేబీ కృతిక మరో రంగంలో తన ప్రతిభను చాటుకుంది. తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆమె అద్భుతమైన మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్టులు షూటింగ్‌ల బిజీ కారణంగా చదువుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేరనే అభిప్రాయం ఉంటుంది. కానీ కృతిక మాత్రం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పు నిరూపించింది.

షూటింగ్‌లు, కెమెరా వెలుగుల మధ్య బిజీగా ఉన్నప్పటికీ చదువుపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్ మార్కుల మెమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె సాధించిన మార్కులు చూసి నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ టాపర్‌వే” అంటూ ఆమెను అభినందిస్తున్నారు.

సినిమాలు, టీవీ షోల‌లో..

బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన కృతిక, ‘కార్తీక దీపం’ తర్వాత కూడా పలు సినిమాలు, టెలివిజన్ షోలలో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ, చదువును సమానంగా కొనసాగిస్తూ రెండింటినీ సమతూకంగా నిర్వహించడం ఆమె ప్రత్యేకతగా నిలిచింది.

నటనలో మంచి భవిష్యత్తు ఉన్న కృతిక, విద్యా రంగంలో కూడా ఇదే స్థాయిలో ముందుకు సాగాలని ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు. చిన్న వయసులోనే కృషి, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని కృతిక మరోసారి నిరూపించింది.