Meenaakshi Chaudhary | తొలి రోజుల్లో ఎదురైన కష్టాలు చెప్పిన హీరోయిన్ ..ఆ దర్శకుడి వల్ల మొదటి రోజే ఏడ్చాను
Meenaakshi Chaudhary | తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ ఆమెకు కలిసి వస్తోందనే చెప్పాలి.
Meenaakshi Chaudhary | తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ ఆమెకు కలిసి వస్తోందనే చెప్పాలి. 2024 సంక్రాంతికి గుంటూరు కారం, 2025 సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి, ఇప్పుడు 2026 సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో మరోసారి పండుగ బరిలో నిలవబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీనాక్షి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన సవాళ్లు, భావోద్వేగ అనుభవాలను కూడా ఓపెన్‌గా పంచుకుంది.
మీనాక్షి మాట్లాడుతూ… తన కెరీర్‌లో తొలి అడుగు హిందీలో చేసిన ఔట్ ఆఫ్ లవ్ వెబ్ సిరీస్ అని గుర్తు చేసుకుంది. ఆ సిరీస్‌కు దర్శకత్వం వహించిన తిగ్మన్షు ధూలియా చాలా స్ట్రిక్ట్ డైరెక్టర్ అని, అప్పటికే ఆయన సీనియర్ కావడంతో షూటింగ్ వాతావరణం కూడా కాస్త టెన్షన్‌గా ఉండేదని చెప్పింది. “అది నా ఫస్ట్ సిరీస్. అప్పటివరకు నేను సినిమాలు కూడా చేయలేదు. షూటింగ్ మొదటి రోజే డైరెక్టర్ నన్ను గట్టిగా మందలించారు. ఆ సమయంలో నేను పూర్తిగా కుంగిపోయాను. ఏడ్చేశాను కూడా. అప్పుడే ‘సినిమాలు నాకు సరిపోవు, మానేయాలి’ అని ఫిక్స్ అయ్యాను” అని చెప్పుకొచ్చింది.
ఆ క్షణాల్లో తన మేనేజర్‌కు ఫోన్ చేసి, ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పినట్లు వెల్లడించింది. అయితే కాంట్రాక్ట్ సైన్ అయిపోయిందని, తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందేనని చెప్పడంతో, ఆ తర్వాత నుంచి మరింత కష్టపడి పనిచేశానని తెలిపింది. “అప్పట్లో ఆ కష్టాలు పడకపోయి ఉంటే, ఈ రోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదేమో. ఆ అనుభవాలే నన్ను బలంగా తీర్చిదిద్దాయి” అంటూ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, ఆ మొదటి రోజుల్లో ఎదురైన ఒత్తిడి, భయాలే తన కెరీర్‌కు పునాది అయ్యాయని మీనాక్షి భావిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలు, పెద్ద హీరోల సరసన అవకాశాలు, పండుగ సీజన్లలో విడుదలయ్యే చిత్రాలతో ఆమె గ్రాఫ్ స్థిరంగా పెరుగుతోంది. మొత్తంగా చూస్తే, కష్టాలను దాటుకుని ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి, అనగనగా ఒక రాజుతో మరోసారి సంక్రాంతి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram