Mohanlal | అరుదైన చారిత్రాత్మ‌క ఘ‌ట్టం… 100వ సినిమాతో ఆ ఇద్ద‌రు స్టార్స్ మళ్లీ కలయిక

Mohanlal | మలయాళ సినీ పరిశ్రమలో ఒక అరుదైన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. లెజెండరీ నటుడు మోహన్‌లాల్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి చేతులు కలపబోతున్నారు.

Mohanlal | మలయాళ సినీ పరిశ్రమలో ఒక అరుదైన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. లెజెండరీ నటుడు మోహన్‌లాల్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి చేతులు కలపబోతున్నారు. ఈసారి ఈ కాంబినేషన్‌కు మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే, ప్రియదర్శన్ తన కెరీర్‌లో 100వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, ప్రియదర్శన్ తన తొలి చిత్రాన్ని కూడా మోహన్‌లాల్‌తోనే ప్రారంభించారు. ఇప్పుడు అదే హీరోతో తన 100వ సినిమాను రూపొందించడం ‘ఫుల్ సర్కిల్ మూమెంట్’గా సినీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఒక దర్శకుడి మొదటి సినిమా, 100వ సినిమా రెండింటిలోనూ ఒకే హీరో నటించడం అనేది భారతీయ సినీ చరిత్రలో అరుదైన సంఘటనగా నిలవనుందని విశ్లేషకులు అంటున్నారు.

టైటిల్‌, క‌థ గోప్యంగా..

ఇప్పటివరకు ప్రియదర్శన్ ప్రధానంగా కామెడీ చిత్రాలతోనే ప్రేక్షకులను అలరించారు. అయితే ఈసారి ఆయన ఒక సంగీత ప్రధాన కథను ఎంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. కథ వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరంబవూర్ తన ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. కో-ప్రొడ్యూసర్‌గా బిను జార్జ్ అలెగ్జాండర్ వ్యవహరించనున్నారు. మోహన్‌లాల్‌కు అత్యంత సన్నిహితుడైన ఆంటోనీ పెరంబవూర్ నిర్మాణంలో ఈ సినిమా రావడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూరుస్తోంది.

స్నేహితుడికి శుభాకాంక్ష‌లు..

ఈ సందర్భంగా మోహన్‌లాల్ సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. ప్రియదర్శన్ 100 సినిమాల మైలురాయి చేరుకోవడం కేవలం సంఖ్య కాదని, అది ఆయన కృషి, అంకితభావం, కథలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తాను భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నానని, కొన్ని అనుభూతులను మాటల్లో చెప్పలేమని తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలిపారు.

మొత్తానికి, మోహన్‌లాల్-ప్రియదర్శన్ కాంబో మరోసారి తెరపైకి రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, ఇద్దరు దిగ్గజాల అనుబంధానికి ప్రతీకగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Latest News