Drishyam 3 | సినిమా ఇండస్ట్రీలో “డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం” అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం నటనతో పాటు చదువును కూడా సమానంగా కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ‘దృశ్యం 3’ సినిమాలో నర్స్ పాత్రలో కనిపించిన నటి శ్రద్ధా గోకుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. తెరపై నర్స్‌గా కనిపించిన ఈ మలయాళ బ్యూటీ నిజ జీవితంలో నిజంగానే డాక్టర్ కావడమే.

చిన్నప్పుడే కెమెరా ముందుకు

శ్రద్ధా గోకుల్ చిన్న వయసులోనే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు టీవీ సీరియల్స్, షోలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘హలో కుట్టిచేతన్’ సీరియల్ ద్వారా చిన్నతనంలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

అలాగే ‘సూపర్ డ్యాన్సర్ జూనియర్’ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొని తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. డ్యాన్స్, యాక్టింగ్ రెండింట్లోనూ మంచి గుర్తింపు రావడంతో సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.

చదువు కోసం యాక్టింగ్‌కు బ్రేక్

సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ.. శ్రద్ధా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. నటన కంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుని కొంతకాలం పూర్తిగా యాక్టింగ్‌కు దూరమైంది. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ పూర్తి చేసిన ఆమె.. తర్వాత కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. దీంతో శ్రద్ధా నిజంగానే డాక్టర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగించింది.

అనుకోకుండా మళ్లీ సినిమాల్లోకి

మెడిసిన్ పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి రావాలనే ఆలోచన శ్రద్ధాకు లేదట. అయితే కొచ్చిలో జరిగిన ఒక ఆడిషన్‌కు అనుకోకుండా హాజరుకావడంతో ఆమె జీవితం మళ్లీ మలుపు తిరిగింది. ఆ ఆడిషన్‌లో సెలెక్ట్ అయిన శ్రద్ధాకు దర్శకుడు జీతూ జోసెఫ్ తన ‘వళతు వశతె కల్లాన్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అందులో ఆమె పాత్ర చిన్నదే అయినా మంచి గుర్తింపు వచ్చింది.

దాంతో జీతూ జోసెఫ్ తన తర్వాతి భారీ ప్రాజెక్ట్ ‘దృశ్యం 3’లో కూడా శ్రద్ధాకు అవకాశం కల్పించారు. ఈ సినిమాలో ఆమె నర్స్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

“యాక్టింగ్, మెడిసిన్ రెండూ కావాలి”

ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడిన శ్రద్ధా.. యాక్టింగ్, మెడిసిన్ రెండింటినీ కొనసాగించాలని ఉందని చెప్పింది.

“డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయాలని ఉంది. అందుకోసం ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నాను. అలాగే డ్యాన్సింగ్, యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం. మంచి అవకాశాలు వస్తే సినిమాలు కూడా కొనసాగిస్తాను” అని తెలిపింది.

శ్రీలీల తరహాలోనే మరో డాక్టర్ హీరోయిన్

ఇటీవల తెలుగు స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా మెడిసిన్ పట్టా అందుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రద్ధా గోకుల్ కూడా అదే జాబితాలో చేరడంతో సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకవైపు వైద్య విద్యను పూర్తి చేస్తూనే.. మరోవైపు నటిగా గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ‘దృశ్యం 3’ సక్సెస్‌తో శ్రద్ధా గోకుల్‌కు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.