NTR | టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు (మే 20) తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నందమూరి కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన, తన అద్భుత నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగిన తారక్, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు మే 20, 1983న హైదరాబాద్‌లో ఎన్టీఆర్ జన్మించారు. చిన్నతనంలో ఆయన అసలు పేరు తారక్. అయితే ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా షూటింగ్ సమయంలో సీనియర్ ఎన్టీఆర్‌ను కలిసినప్పుడు ఆయన పేరు మార్చి నందమూరి తారక రామారావుగా పెట్టినట్లు చెబుతారు. ఆ తర్వాత తారక్.. జూనియర్ ఎన్టీఆర్‌గా అభిమానుల్లో గుర్తింపు పొందారు.
నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా..
చిన్నప్పటి నుంచే ఎంతో చురుకుగా ఉండే ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని విద్యారణ్య హై స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియేట్ చదివారు. చదువు పూర్తయ్యాక పూర్తిస్థాయిలో సినీ రంగంపై దృష్టి పెట్టారు.
తన 15 ఏళ్ల వయసులో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘బాల రామాయణం’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. తర్వాత ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్‌కు పెద్ద మలుపు తిరిగింది. ఆ సినిమా విజయంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
డ్యాన్స్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్..
నటనతో పాటు ఎన్టీఆర్ మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. ఆయన డ్యాన్స్ స్టెప్పులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే బ్యాడ్మింటన్, క్రికెట్ ఆటలంటే ఆయనకు చాలా ఇష్టం. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దాన వీర సూర కర్ణ’ ఆయనకు అత్యంత ఇష్టమైన చిత్రం అని పలుమార్లు చెప్పారు.
తన కెరీర్‌లో పాత్రల కోసం శరీరాకృతిలో కూడా ఎన్నో మార్పులు చేశారు. ‘రాఖీ’ సినిమా సమయంలో బరువు పెరిగిన ఎన్టీఆర్, తర్వాత ‘యమదొంగ’ చిత్రం కోసం దాదాపు 20 కిలోల వరకు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నటుడే కాదు గాయకుడు కూడా..
ఎన్టీఆర్ కేవలం నటుడే కాదు, మంచి గాయకుడు కూడా. ‘అదుర్స్’, ‘కంత్రి’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. వ్యక్తిగత జీవితంలో 2011 మే 5న లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే ఆయనకు 9999 నంబర్ అంటే ప్రత్యేక అభిమానం ఉన్నట్లు చెబుతారు.
ఒకవైపు కుటుంబంతో సమయం గడుపుతూ, మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
