Pakeezah | దీన స్థితిలో ప్రముఖ టాలీవుడ్ నటి .. వృద్ధాశ్రమంలో చేరడంతో కాస్త కుదుటపడ్డ ఆరోగ్యం
Pakeezah | ఒకప్పుడు తన సహజమైన నటనతో, ప్రత్యేకమైన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటి వాసుకి (పాకీజా) జీవితంలో విచిత్రకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. వెండితెరపై నవ్వులు పూయించిన ఈ నటి ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ జీవితం సాగిస్తున్నారు.
Pakeezah | ఒకప్పుడు తన సహజమైన నటనతో, ప్రత్యేకమైన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటి వాసుకి (పాకీజా) జీవితంలో విచిత్రకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. వెండితెరపై నవ్వులు పూయించిన ఈ నటి ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ జీవితం సాగిస్తున్నారు. ‘అసెంబ్లీ రౌడీ’, ‘పెదరాయుడు’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో పాకీజా పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలు. తమిళనాడుకు చెందిన వాసుకి 1991లో మోహన్ బాబు హీరోగా నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.
తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఆమె, ఆ తర్వాత వరుసగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించారు. అయితే కాలక్రమేణా సినిమా అవకాశాలు తగ్గిపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో ఆమె దుర్భర పరిస్థితి ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడంతో, పలువురు స్పందించారు. శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ముందుకు వచ్చి ఆమెకు ఆశ్రయం కల్పించడంతో ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. ఈ సందర్భంగా వాసుకి భావోద్వేగంగా స్పందించారు. తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన గురువు మోహన్ బాబు కుటుంబానికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు తనకు కంటి శస్త్రచికిత్స చేయించి అండగా నిలిచారని పేర్కొన్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు కలిసి తనకు రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా తన పరిస్థితిని తెలుసుకుని సహాయం చేస్తున్నారని, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వ సహాయం అత్యవసరమని వాసుకి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు వృద్ధాప్య పింఛను, బియ్యం కార్డు మంజూరు చేస్తే జీవనాధారంగా ఉంటుందని కోరారు. వృద్ధాశ్రమంలో చేరిన తర్వాత తన ఆరోగ్యం క్రమంగా కుదుటపడిందని, అక్కడే ఉన్న ఇతర వృద్ధులకు సేవ చేస్తూ రోజులు గడుపుతున్నానని తెలిపారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పంచిన వాసుకి జీవితం, సినీ పరిశ్రమలో అవకాశాల అనిశ్చితిని, కళాకారుల భవితవ్యంపై సమాజం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram