Pawan Kalyan | నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకుని, అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ ప్రస్థానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ్ రాజకీయ విజయంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఒక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సరదాగా స్పందిస్తూ.. విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) తొలి ఎన్నికల బరిలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చూసి తనకు కొద్దిగా “అసూయ” కలిగిందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆయన పూర్తిగా సరదా కోణంలోనే చెప్పినట్లు స్పష్టం చేశారు.
15 సంవత్సరాలు తిరిగాను..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ఈ రోజుల్లో తమిళ రాజకీయాలను చూస్తుంటే చాలా సులభంగా జరిగినట్లు అనిపిస్తోంది. కొంచెం అసూయగా కూడా అనిపించింది. కటౌట్లు, త్రీడీ హోలోగ్రామ్‌లతో ప్రచారం చేసి ఎంతో సంతోషంగా గెలిచేశారు. కానీ నేను మాత్రం రాజకీయాల్లో నిలబడటానికి 15 సంవత్సరాలు రోడ్లపై తిరిగాను” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
అనంతరం రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, రాజకీయ పార్టీని నడపడం అంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాదని అన్నారు. ప్రజల సమస్యలు, వారి ఆకాంక్షలు, సామాజిక పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.
తరచూ చర్చ..
“లక్షలాది మంది ప్రజల అంచనాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. ఏదైనా మాట్లాడాలన్నా సరైన అవగాహన, జ్ఞానం ఉండాలి. అందుకే నేను రాజకీయాల్లో ఇంతకాలం కష్టపడ్డాను” అని పవన్ పేర్కొన్నారు.
ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, విజయ్ రాజకీయ ప్రయాణాలపై అనేక పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖులు కావడంతో నెటిజన్లు వీరి ప్రయాణాలను తరచూ చర్చిస్తున్నారు.
మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి కూడా విజయ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు సమాచారం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తూ, దివంగత నేత ఎంజీఆర్ తరహాలో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలని ఆయన ఆకాంక్షించినట్లు తెలుస్తోంది.
ఇక విజయ్ విషయానికి వస్తే, ఆయన స్థాపించిన టీవీకే పార్టీ చాలా తక్కువ సమయంలోనే తమిళ రాజకీయాల్లో బలమైన ప్రభావం చూపించింది. దశాబ్దాలుగా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ప్రధాన పార్టీలను ఎదుర్కొని సాధించిన ఈ విజయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది.
