Chiranjeevi | “తిరుపతిలో స్వామి దర్శనం దొరుకుతుంది.. కానీ చిరంజీవిని కలవడం కష్టం”.. భావోద్వేగానికి గురైన నటి

Chiranjeevi | సినీ పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను ఒక్కసారి కలవాలని, మాట్లాడాలని, ఫొటో దిగాలని అభిమానులు మాత్రమే కాదు, సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది కళాకారులు కూడా కోరుకుంటుంటారు.

Chiranjeevi | సినీ పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను ఒక్కసారి కలవాలని, మాట్లాడాలని, ఫొటో దిగాలని అభిమానులు మాత్రమే కాదు, సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది కళాకారులు కూడా కోరుకుంటుంటారు. అయితే తాజాగా నటి పులి సీత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పులి సీత, అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా అవకాశాలు అందుకున్నారు. ‘జయ జానకి నాయక’, ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్3’, ‘దేవర’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె, ఇటీవల ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ తల్లి పాత్రలో కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సీత, తనకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఎంత అభిమానం ఉందో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

చిరంజీవిని క‌లిసే అవ‌కాశం రాలేదు..

తాను మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు వీరాభిమానినని చెప్పిన సీత, సినీ పరిశ్రమలోకి వచ్చి దాదాపు పదకొండేళ్లు దాటినా ఇప్పటివరకు చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదని వెల్లడించారు. చిరంజీవిని కలవాలంటే చాలా కష్టమని, ఆయనను చేరుకోవడానికి అనేక స్థాయిలను దాటాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె ఓ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో తాను క్రమం తప్పకుండా రక్తదానం చేస్తుంటానని, ఒకసారి కుటుంబంలో వైద్య అవసరం రావడంతో సహాయం కోసం అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అయితే పలుమార్లు ప్రయత్నించినప్పటికీ చిరంజీవిని కలిసే అవకాశం దక్కలేదని చెప్పారు. “ఆయన ఇంటికి కూడా వెళ్లాను. కానీ అక్కడి సిబ్బంది నుంచి సరైన స్పందన రాలేదు. చిరంజీవి గారికి ఈ విషయాలు తెలిసి ఉండవని నేను భావిస్తున్నాను. అందుకే ఎవరిపైనా వ్యక్తిగతంగా నాకేమీ కోపం లేదు” అని సీత అన్నారు.

స్వామి ద‌ర్శ‌నం దొరుకుతుంది కాని..

తన పెద్ద కుమారుడు కూడా చిరంజీవికి వీరాభిమాని అని, ఒకసారి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే ఏం కావాలని అడిగితే, ‘చిరంజీవి గారిని ఒక్కసారి కలవాలి’ అని కోరాడని తెలిపారు. అయితే ఆ కోరికను నెరవేర్చలేకపోయానని చెప్పిన సీత భావోద్వేగానికి గురయ్యారు.

“తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకొచ్చు. కానీ చిరంజీవి గారిని కలవడం మాత్రం చాలా కష్టం అనిపించింది. ఇది ఆయన వల్ల కాదు. ఆయన చుట్టూ ఉండే వ్యవస్థ వల్ల జరిగే విషయం. ఒక అభిమానిగా ఇది నాకు బాధ కలిగించింది” అని ఆమె వ్యాఖ్యానించారు.

అదే సమయంలో చిరంజీవి గురించి తనకు అపారమైన గౌరవం ఉందని, ఆయనపై తన అభిమానం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. మెగా కుటుంబంపై ఎవరైనా విమర్శలు చేసినప్పుడు తాను ముందుండి స్పందించానని, పవన్ కళ్యాణ్‌పై రాజకీయ విమర్శలు వచ్చినా తన వంతు మద్దతు ఇచ్చానని తెలిపారు.

పులి సీత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు అభిమానులు ఆమె బాధను అర్థం చేసుకుంటూ స్పందిస్తుండగా, మరికొందరు ప్రముఖులను కలవడానికి ఉండే భద్రతా పరిమితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, అభిమానిగా చిరంజీవిని ఒక్కసారి కలవాలనే తన కోరిక ఇప్పటికీ నెరవేరలేదని చెప్పిన పులి సీత వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.

Latest News