Shivanna-Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ ప్రత్యేక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ అనంతరం రామ్ చరణ్, శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్ పాల్గొన్న ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కిస్సింగ్ సీన్ వైరల్..

ఇంటర్వ్యూలో యాంకర్, ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరియు కన్నడ లెజెండరీ నటుడు డా. రాజ్‌కుమార్ కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో తీసిన అరుదైన ఫొటోను చూపించారు. ఆ సందర్భంలో రాజ్‌కుమార్ ప్రేమగా చిరంజీవిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్న ఘటన అప్పట్లో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఆ ఐకానిక్ మూమెంట్‌ను మళ్లీ రీక్రియేట్ చేయాలని యాంకర్ కోరగా, శివరాజ్‌కుమార్ వెంటనే రామ్ చరణ్‌ను ఆప్యాయంగా హత్తుకుని ఆయన బుగ్గపై ముద్దు పెట్టుకున్నారు. ఈ అనూహ్యమైన, భావోద్వేగభరితమైన క్షణం అక్కడున్న వారిని ఆకట్టుకోగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొన‌సాగిస్తున్న వార‌సులు..

చిరంజీవి–రాజ్‌కుమార్ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహబంధానికి ఈ ఘటన మరోసారి నిదర్శనంగా నిలిచింది. ఒకప్పుడు తండ్రులు పంచుకున్న అనుబంధాన్ని ఇప్పుడు వారి వారసులు కొనసాగిస్తున్నారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వీడియోపై మెగా అభిమానులతో పాటు కన్నడ సినీ అభిమానులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల మధ్య ఉన్న స్నేహానికి ఇది ప్రతీకగా నిలిచిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

‘పెద్ది’ విడుదలకు ముందు వచ్చిన ఈ ఎమోషనల్ మూమెంట్ సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ప్రస్తుతం శివన్న–చరణ్ రీక్రియేట్ చేసిన ఈ సీన్ నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.