Raasi | చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం ప్రారంభించి, దాదాపు మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ రాశి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఇండస్ట్రీ అనుభవాలపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన నటించిన ఆమె, తన కెరీర్ పీక్స్ గురించి, ఎదురైన గాసిప్స్ గురించి, కుటుంబ నేపథ్యం గురించి ఓపెన్‌గా మాట్లాడారు.
నేను పుట్టి పెరిగింది సినిమా ఇండస్ట్రీలోనే. నా లైఫ్ ఓపెన్ బుక్‌లాంటిది. పెళ్లికి ముందు నా గురించి అందరికీ తెలుసు. కానీ పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి సినిమాలకు దూరమయ్యాను అని రాశి తెలిపారు. తన తండ్రి తనను హీరోయిన్‌గా చూడాలని కలగన్నారని, తన కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆయన మరణించారని చెప్పారు. నా కెరీర్‌లో నేను చూసిన సక్సెస్ చాలు. ఇంకా ఏమీ ఆశించను అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
పుట్టిన రోజు కూడా జరుపుకోవడం లేదు..
ప్రేయసిరావే సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడిన రాశి, “ఆ సినిమా నాకు ఎంతో ఎమోషనల్. ఆ సినిమాని చూసి మొదట ఫోన్ చేసి అభినందించినది మా నాన్నే. ఆయన చివరిగా చూసిన సినిమా కూడా అదే. అందుకే ఆ చిత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని చెప్పారు. అదే రోజున తన తండ్రి మరణించడంతో అప్పటి నుంచి పుట్టినరోజు జరుపుకోవడం మానేశానని వెల్లడించారు.
తనను హీరోయిన్‌గా మార్చడంలో కుటుంబం పాత్ర కీలకమని చెప్పిన రాశి, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు పెద్దలు “నువ్వు హీరోయిన్ మెటీరియల్” అని చెప్పడం తనకు ప్రేరణనిచ్చిందని అన్నారు. కెరీర్ పీక్స్‌లో ఒకేరోజు నాలుగు సినిమాల్లో షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
శ్రీకాంత్‌తో రిలేషన్ షిప్..
ఇండస్ట్రీలో గాసిప్స్‌పై స్పందిస్తూ, హీరో శ్రీకాంత్‌తో తాను ఎనిమిది సినిమాలు చేసినప్పటికీ ఎలాంటి రూమర్లు రాలేదని చెప్పారు. “అందరి మధ్య హెల్దీ రిలేషన్ ఉండేది. ఇప్పుడు రెండు మూడు సినిమాలు కలిసి చేస్తేనే గాసిప్స్ సృష్టిస్తున్నారు” అని అన్నారు. అలాగే జేడీ చక్రవర్తి తన బెస్ట్ ఫ్రెండ్ అని వెల్లడించారు.
తన కెరీర్‌లో పీఆర్ లేకపోవడమే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణమని చెప్పిన రాశి, “అప్పట్లో సోషల్ మీడియా లేదు. ప్రచారం లేకుండా మా పని మేము చేసుకునేవాళ్లం. ఇప్పటికీ అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను. సినిమా ఒప్పుకుంటే ఒకే ఒక్క ప్రెస్ మీట్‌కి వస్తాను” అని తెలిపారు. తన కెరీర్ మేనేజ్‌మెంట్‌లో తన తండ్రి, కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారని చెప్పారు.
నేను మిక్స్ డ్ బ్రీడ్..
వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ, “నేను పెళ్లి కోసం లావు అయ్యాను. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. కెరీర్ గురించి అప్పటికే సంతృప్తి ఉంది” అని అన్నారు. తన కుటుంబ నేపథ్యంపై మాట్లాడుతూ, “నాది మిక్స్డ్ బ్రీడ్. నాన్న బ్రాహ్మిణ్, అమ్మ గౌడ. అందుకే నాకు ఆ రెండు సంస్కృతుల మేళవింపు ఉంది” అని వివరించారు.
ఇక టాలీవుడ్ గురించి మాట్లాడుతూ, “ఇక్కడ అందరూ బాబులే. హీరో అంటే రూపం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. ఏజ్‌ను బట్టి హీరోయిన్ అనే కాన్సెప్ట్ ఇక్కడే ఎక్కువగా కనిపిస్తుంది” అంటూ రాశి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
