Senior Heros | సీనియర్ హీరోలకి తలనొప్పిగా మారిన హీరోయిన్ సెలెక్షన్… టాలీవుడ్‌లో ఏజ్ గ్యాప్‌పై సీరియ‌స్ చ‌ర్చ‌

Senior Heros | టాలీవుడ్‌లో సీనియర్ హీరోల సినిమాలకు హీరోయిన్ ఎంపిక ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు వయసు పరంగా ఒక దశకు చేరుకోవడంతో… వారికి తగిన వయస్సు కలిగిన హీరోయిన్లను ఎంపిక చేయడం మేకర్స్‌కు సవాలుగా మారుతోంది.

  • By: sn |    movies |    Published on : Dec 17, 2025 3:56 PM IST
Senior Heros | సీనియర్ హీరోలకి తలనొప్పిగా మారిన హీరోయిన్ సెలెక్షన్… టాలీవుడ్‌లో ఏజ్ గ్యాప్‌పై సీరియ‌స్ చ‌ర్చ‌

Senior Heros | టాలీవుడ్‌లో సీనియర్ హీరోల సినిమాలకు హీరోయిన్ ఎంపిక ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు వయసు పరంగా ఒక దశకు చేరుకోవడంతో… వారికి తగిన వయస్సు కలిగిన హీరోయిన్లను ఎంపిక చేయడం మేకర్స్‌కు సవాలుగా మారుతోంది. ఇదే కారణంగా కొన్ని సినిమాలు ఆలస్యమవుతున్నాయన్న మాట కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చాలా సందర్భాల్లో సినిమా కథ ఓకే అయి, స్క్రిప్ట్ లాక్ అయి, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినప్పటికీ… హీరోయిన్ ఫైనల్ చేయలేక షూటింగ్ ప్రారంభం ఆలస్యమవుతోంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కొత్త భామలను తీసుకురావాలని అనుకున్నా… వయస్సు పరంగా సెట్ అవుతారా? అన్న సందేహంతో వెనకడుగు వేస్తున్నారు.

ఒకవేళ కొత్త హీరోయిన్‌ను ట్రై చేసినా… దానిపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో మేకర్స్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో పదే పదే అదే హీరోయిన్లతో సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హీరోల వయస్సు పెరిగే కొద్దీ ఈ సమస్య మరింత పెద్దదవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. చేసేదేమీ లేక కొందరు సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్లతో జోడీ కడుతున్నారు. ఇప్పటికే పలువురు యువ హీరోయిన్లు సీనియర్ హీరోలతో నటించగా… ఆ విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి, శ్రీలీల వంటి యంగ్ హీరోయిన్లు నటించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించడంపైనా ఓ వర్గం ఆడియన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

అయితే ఇలాంటి విమర్శలు గతంలో కూడా వచ్చాయి. ‘ధమాకా’ సినిమా సమయంలో రవితేజ–శ్రీలీల జంట మధ్య ఏజ్ గ్యాప్‌పై చర్చ జరిగినప్పటికీ… సినిమా విడుదలైన తర్వాత వారి జంట ఆన్ స్క్రీన్‌పై బాగా వర్క్ అయిందనే టాక్ వినిపించింది. అదే విధంగా బాలకృష్ణ–ప్రగ్యా జైస్వాల్ జంటపై విమర్శలు వచ్చినా… సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకులు ఆ జంటను స్వీకరించారన్న అభిప్రాయం వ్యక్తమైంది.అయినా సరే సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం సీనియర్ హీరోలు–యంగ్ హీరోయిన్ల జంటలపై తరచూ కామెంట్స్ చేస్తూ… ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు చర్చలో ఉంచుతున్నారు. టాలీవుడ్‌లో సీనియర్ హీరోల సినిమాలు కొనసాగుతున్నంతకాలం… ఈ ఏజ్ గ్యాప్ డిబేట్ కూడా ఆగేలా కనిపించడం లేదు.