Anil Ravipudi | సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళుతున్న‌ అనిల్ రావిపూడి.. తదుపరి హీరో ఎవ‌రు?

Anil Ravipudi | టాలీవుడ్‌లో వరుస హిట్లతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత కీలక దశను ఆస్వాదిస్తున్నారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’తో మరోసారి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నిరూపించారు.

  • By: sn |    movies |    Published on : Jan 22, 2026 10:31 AM IST
Anil Ravipudi | సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళుతున్న‌ అనిల్ రావిపూడి.. తదుపరి హీరో ఎవ‌రు?

Anil Ravipudi | టాలీవుడ్‌లో వరుస హిట్లతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత కీలక దశను ఆస్వాదిస్తున్నారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’తో మరోసారి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నిరూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో అద్భుతమైన స్పందనను రాబడుతూ రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తోంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకున్న ఈ సినిమా చిరంజీవి మార్కెట్‌ను మరింత బలోపేతం చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విజయంతో అనిల్ రావిపూడి పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చకు వస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ తన గత సినిమాల గురించి, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణతో ప్రేక్షకులు ఊహించని తరహా సినిమా చేయాలన్నదే తన ఆలోచనగా చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘భగవంత్ కేసరి’ తెరకెక్కిందని, అయితే ఆ సినిమా ఇంకా పెద్ద స్థాయిలో హిట్ కావాల్సిందన్న భావన తనలో ఉందని పేర్కొన్నారు. సినిమా విడుదల సమయంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా అప్పటి పరిస్థితులు బాలయ్య అభిమానులపై కొంత ప్రభావం చూపాయని అనిల్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు సినిమాను ఆదరించి కమర్షియల్ హిట్ చేశారని, పరిస్థితులు అనుకూలంగా ఉంటే స్పందన మరింత బలంగా ఉండేదని వెల్లడించారు.

2023 అక్టోబర్ 19న విడుదలైన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా, 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మొదలైన ఈ ప్రయాణం జాతీయ అవార్డు వరకూ చేరుకోవడం అనిల్ రావిపూడి కెరీర్‌లో ఒక కీలక మైలురాయిగా మారింది. ఇప్పుడు తాజా చర్చ అంతా అనిల్ రావిపూడి తదుపరి సినిమాపై సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా ఆయన టార్గెట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ సినిమా ఏ హీరోతో అన్నదానిపై స్పష్టత లేదు. చిరంజీవి ఇప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, వెంకటేష్ కూడా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అనిల్‌కు వెంటనే అందుబాటులో ఉండే స్టార్ హీరోగా మరోసారి నందమూరి బాలకృష్ణ పేరు వినిపిస్తుంది. ఈ జోడీ మళ్లీ కలిసి పనిచేస్తే బాక్సాఫీస్ వద్ద మరోసారి భారీ ప్రభావం చూపడం ఖాయమన్న అంచనాలు అభిమానుల్లో బలంగా వినిపిస్తున్నాయి.