Vijay | బ్లేజర్‌కు గుడ్‌బై.. సంప్రదాయ పంచెకట్టులో సీఎం విజయ్, నోరెళ్ల‌పెట్టిన నెటిజ‌న్స్

Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ మరోసారి తన స్టైల్‌తో వార్తల్లో నిలిచారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆధునిక బ్లేజర్ సూట్‌లలో కనిపిస్తూ వస్తున్న విజయ్.. తాజాగా సంప్రదాయ తమిళ పంచెకట్టులో దర్శనమివ్వడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ మరోసారి తన స్టైల్‌తో వార్తల్లో నిలిచారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆధునిక బ్లేజర్ సూట్‌లలో కనిపిస్తూ వస్తున్న విజయ్.. తాజాగా సంప్రదాయ తమిళ పంచెకట్టులో దర్శనమివ్వడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే విజయ్ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ పంచెకట్టు సంస్కృతికి భిన్నంగా బ్లేజర్ సూట్‌లో ప్రమాణస్వీకారానికి హాజరై అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, ఢిల్లీ పర్యటనలు అన్నింటిలోనూ అదే ఫార్మల్ లుక్‌ను కొనసాగించారు. దీంతో విజయ్ కొత్త తరహా రాజకీయ ఇమేజ్‌ను నిర్మించుకుంటున్నారని విశ్లేషణలు వినిపించాయి.

పంచె క‌ట్టులో..

అయితే తాజాగా ఆయన పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించారు. రాష్ట్రంలోని పలువురు ఉన్నతాధికారులు, కొత్తగా నియమితులైన అధికారులతో సమావేశమైన సందర్భంగా విజయ్ సంప్రదాయ తెల్లటి పంచె, షర్ట్ ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. ఎప్పుడూ వెస్ట్రన్ ఫార్మల్ లుక్‌లో కనిపించే విజయ్ ఒక్కసారిగా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించడంతో అక్కడున్న అధికారులు సైతం ఆసక్తిగా గమనించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల ద్వారా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు అయితే “ఇదే అసలైన తమిళ నాయకుడి లుక్”, “దళపతి ఇప్పుడు పూర్తిగా ప్రజల మనిషిగా మారిపోయారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇది కేవలం వస్త్రధారణ మార్పు కాదని, తమిళ సంప్రదాయాలకు విజయ్ ఇస్తున్న గౌరవానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.

అనేక చ‌ర్చ‌లు..

తమిళనాడు రాజకీయాల్లో సంప్రదాయ పంచెకట్టుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి, స్టాలిన్ వంటి నేతలు అధికారిక కార్యక్రమాల్లో సంప్రదాయ వస్త్రధారణకే ప్రాధాన్యత ఇచ్చేవారు. చట్టసభల నుంచి పార్లమెంట్ వరకు తమిళ నేతలు తమ సాంస్కృతిక గుర్తింపును కొనసాగించడం అక్కడి రాజకీయ సంస్కృతిలో భాగంగా మారింది.

విజయ్ కూడా సీఎం అయిన తర్వాత ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని చాలామంది భావించినప్పటికీ, ఆయన బ్లేజర్ సూట్‌తో కనిపించడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆధునికత, గ్లోబల్ లీడర్ ఇమేజ్‌ను ప్రొజెక్ట్ చేయడానికే విజయ్ ఆ స్టైల్‌ను ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు ఆయన మళ్లీ సంప్రదాయ పంచెకట్టుకు మారడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? లేక ఇది కేవలం సందర్భానుసారమైన వస్త్రధారణ మార్పేనా? అన్నదానిపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతో విజయ్ ఈ మార్పు చేసివుంటారని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఏదేమైనా.. సినీ స్టార్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ తన స్టైల్, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ ద్వారా కూడా ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన సంప్రదాయ పంచెకట్టులో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భారీ స్పందన తెచ్చుకుంటున్నాయి.

Latest News