NTR | విజయ్ ప్రభంజనం తర్వాత ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చలు.. నిజంగా సాధ్యమేనా?

NTR | తమిళనాడులో సినీ నటుడు విజయ్ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే సంచలన విజయాన్ని నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన స్థాపించిన టీవీకే ప్రభంజనంలో పలువురు సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఓటమి పాలయ్యారని వార్తలు రావడంతో, ఇప్పుడు అదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కొత్త రాజకీయ ప్రయోగం సాధ్యమా అన్న చర్చ మొదలైంది.

  • By: Sandeep |    movies |    Published on : May 05, 2026 8:15 AM IST
NTR | విజయ్ ప్రభంజనం తర్వాత ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చలు.. నిజంగా సాధ్యమేనా?

NTR | తమిళనాడులో సినీ నటుడు విజయ్ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే సంచలన విజయాన్ని నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన స్థాపించిన టీవీకే ప్రభంజనంలో పలువురు సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఓటమి పాలయ్యారని వార్తలు రావడంతో, ఇప్పుడు అదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కొత్త రాజకీయ ప్రయోగం సాధ్యమా అన్న చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో మళ్లీ జోరుగా చర్చ సాగుతోంది. అభిమానులు భారీ ఎత్తున పోస్టులు చేస్తూ, ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా పార్టీ స్థాపిస్తే ఖచ్చితంగా భారీ విజయాలు సాధించవచ్చని అభిప్రాయపడుతున్నారు. కొందరు అయితే, ఆయనకు తన తాత నందమూరి తారక రామారావు తరహాలోనే ప్రజాదరణ ఉందని పేర్కొంటున్నారు.

ఎన్టీఆర్ రావాలంటూ..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ కూటమి పార్టీలతో కలిసి అధికారంలో ఉంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగుతుండగా, భవిష్యత్తులో పార్టీ పగ్గాలు నారా లోకేష్‌కి అప్పగించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇటీవల లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం ఈ మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. ప్రస్తుత టీడీపీ పూర్తిగా నారా కుటుంబానికి పరిమితమైందని, నందమూరి వారసత్వాన్ని కొనసాగించే వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ స్థాపించాలంటూ అభ్యర్థిస్తున్నారు. అంతేకాదు, రాజకీయ అనుభవం లేకుండా రెండు సంవత్సరాల్లోనే విజయ్ భారీ విజయాన్ని సాధించినప్పుడు, మాస్ ఫాలోయింగ్‌తో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉన్న ఎన్టీఆర్ పార్టీ పెడితే మరింత ప్రభావం చూపగలడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

రాజ‌కీయాల‌కు దూరంగా..

అయితే, వాస్తవ పరిస్థితులు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. 2009 ఎన్నికల సమయంలో మహాకూటమికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ ప్రచార సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంఘటన కూడా గుర్తుండే విషయం. ఆ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి తర్వాత ఆయన రాజకీయాలపై మరింత మౌనం పాటించారు.

తదుపరి కాలంలో కూడా రాజకీయాల గురించి ప్రశ్నించగా, తన జీవితం పూర్తిగా సినిమాలపైనే ఆధారపడి ఉందని, వాటిపైనే దృష్టి సారిస్తున్నట్టు స్పష్టం చేశారు. రాజకీయాలపై చర్చించే సమయం లేదని కూడా పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గానీ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గానీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

అయితే తాజాగా తమిళనాడులో విజయ్ సాధించిన విజయంతో మరోసారి ఈ చర్చ మళ్లీ వేడెక్కింది. సోషల్ మీడియాలో అభిమానులు చేస్తున్న ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో, జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం ఇవన్నీ ఊహాగానాలుగానే కనిపిస్తున్నాయి