హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’

తెలుగు ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రాన్ని అందించేందుకు ‘ఓరి నాయనో’ సిద్ధమవుతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణి తేజ గొంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శుభముహూర్తంలో ఘనంగా ప్రారంభమైంది.

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ముహూర్తపు షాట్‌కు తొలి క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించగా, ‘పొలిమేర’ ఫ్రాంచైజీ చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికరమైన కథాంశాలతో తెరకెక్కే సినిమాలు మంచి విజయాలను సాధిస్తాయని, ‘ఓరి నాయనో’ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. చిత్రానికి అవసరమైన సందర్భాల్లో తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ, సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, మంచి కంటెంట్‌తో పాటు అత్యుత్తమ నిర్మాణ విలువలతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. కేవలం 25 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, వచ్చే ఫిబ్రవరి నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

అలాగే దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తన మిత్రుడు, నిర్మాత సాయి అభిషేక్ చేపట్టిన ఈ నూతన ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తూ, చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు అందించారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.

దర్శకుడు మణి తేజ గొంది మాట్లాడుతూ, “ప్రతి గొప్ప ప్రయాణం విశ్వాసంతోనే ప్రారంభమవుతుంది. ‘ఓరి నాయనో’ సినిమా షూటింగ్ ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. నా హృదయానికి దగ్గరైన ఒక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది తొలి అడుగు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు, గుర్తుండిపోయే పాత్రలు, భావోద్వేగభరితమైన క్షణాలతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు మా బృందం కృషి చేస్తుంది” అని తెలిపారు.

‘Every life will have Ori.. Nayano! Moment’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వినోదంతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖుల ఆశీస్సులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం, చిత్ర బృందం నూతన ఉత్సాహంతో ‘ఓరి నాయనో’ తన సినీ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.

Latest News