DNA Glue Protein | అల్జీమర్స్, పార్కిన్సన్ కోసం…. ‘డీఎన్‌ఏ గ్లూ ప్రోటీన్’
అల్జీమర్స్, పార్కిన్సన్‌లకు కొత్త ఆశ. డీఎన్‌ఏ పగుళ్లను రిపేర్ చేసే ప్రత్యేక ‘డీఎన్‌ఏ గ్లూ ప్రోటీన్’ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మన మెదడు కూడా ఒక రోజూ చిట్టి రోబోలా తానే తానూ రిపేర్ చేసుకునే శక్తి కలిగి ఉంటే భలే ఉంటుంది కదా. ఇది ఏదో ఒకరోజు సాధ్యమేనంటున్నారు సైంటిస్టులు. వయస్సు పెరిగేకొద్దీ మన డీఎన్‌ఏలో చిన్న చిన్న పగుళ్లు ఏర్పడతాయి. ఇవి మొదట కనిపించకపోయినా, కాలక్రమేణా మన మెదడు కణాల పనితీరును తగ్గిస్తూ అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తాయి. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు తాజాగా చేసిన ఒక విప్లవాత్మక ఆవిష్కరణ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలా మెదడు కణాల్లోని డీఎన్ఏ లో ఏర్పటిన పగుళ్లను రిపేర్ చేయగలిగే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ను కనుక్కున్నారు. ఇది ‘‘డీఎన్‌ఏ గ్లూ’’ లాగా పనిచేస్తుందంటున్నారు.
కణాల డీఎన్ఏ డ్యామేజీ అయితే….
మన శరీరంలోని ప్రతి కణంలో ప్రధాన భాగం దానిలోని డీఎన్ఏ. మెటబాలిజమ్ నుంచి కణచర్యలన్నింటికీ ఇదే కీలకం. జీవానికి సంబంధించిన కోడ్స్ అన్నింటి రూపమే డీఎన్‌ఏ అనుకోవచ్చు. కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్, టాక్సిన్లు, పర్యావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటివి డీఎన్‌ఏ నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనే అస్థిర అణువులు డీఎన్‌ఏ లో పగుళ్లు లేదా చీలికలను సృష్టిస్తాయి. వీటిని సకాలంలో సరిచేయకపోతే, కణాలు తప్పుగా పనిచేయడం ప్రారంభిస్తాయి. న్యూరాన్లు అంటే మెదడు కణాల రెప్లికేట్ అయ్యే ప్రక్రియ మీద ప్రభావం పడుతుంది. న్యూరాన్లు ఒకసారి దెబ్బతింటే వాటి స్థానంలో కొత్త కణాలు రావు. ఫలితంగా, జ్ఞాపకశక్తి తగ్గడం, మోటార్ నియంత్రణ లోపించడం, ఆలోచనా సామర్థ్యం బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి.
‘డీఎన్‌ఏ గ్లూ ప్రోటీన్’ ఏం చేస్తుంది?
తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ ప్రోటీన్, డీఎన్‌ఏలోని సూక్ష్మ పగుళ్లను గుర్తించి వాటిని రిపేర్ చేస్తుంది. ప్రతీ కణానికి సహజంగా ఉండే మరమ్మతు వ్యవస్థను బలోపేతం చేయడానికి న్యూరాన్ల స్ట్రక్చరల్ స్టెబిలిటీని బాగుచేస్తుంది. డీఎన్‌ఏ సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తే లోపాలను నివారిస్తుంది, కణాల ఆయుష్షును పెంచుతుంది. దీంతో, మెదడు కణాలు ఎక్కువకాలం సజీవంగా ఉండి, మెరుగ్గా పనిచేయగలుగుతాయి.
కొత్త థెరపీల వైపు…
ఇప్పటివరకు అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులకు ఉన్న చికిత్సలు ప్రధానంగా లక్షణాల నివారణపై మాత్రమే దృష్టి సారించాయి. కానీ ఈ ఆవిష్కరణ మాత్రం మూల కారణం.. అంటే దెబ్బతిన్న డీఎన్ఏను లక్ష్యంగా చేసుకుంది. ఇది మెదడు కణాలు క్షీణించకుండా, లేదా దెబ్బతిన్నవి రివర్స్ చేయగలిగే కొత్త థెరపీలు రావడానికి దోహదపడుతుంది. ఈ థెరపీలు జెనెటిక్ రిపేర్ ఆధారంగా ఉంటాయి. మెమరీ లాస్ సమస్యను ప్రారంభంలోనే నివారించేందుకు వీలు కల్పిస్తాయి. వృద్ధాప్యంలో కూడా మెదడు చురుకుదనాన్ని కాపాడే న్యూరోప్రొటెక్షన్ చికిత్సలను రూపొందించవచ్చు. ఇది కేవలం చికిత్సే కాదు, భవిష్యత్తులో వృద్ధాప్యాన్ని నివారించే కొత్త మార్గాలను కనుక్కోవడానికి కూడా సహాయపడుతుంది.