INSV Kaundinya : కౌండిన్య తిరిగొచ్చిందోచ్..!
INSV కౌండిన్య ప్రాచీన సముద్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ముంబై హార్బర్‌కు చేరుకుంది. భారత్-ఒమన్ సముద్ర వారసత్వాన్ని మరోసారి గుర్తుచేసింది.
విధాత : ఐఎన్ఎస్వీ కౌండిన్య భారత్ కు తిరిగొచ్చింది. భారతదేశపు ప్రాచీన సముద్రయాన వైభవానికి, 5వ శతాబ్ధపు నౌకా నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక పునఃసృష్టి ఐఎన్ఎస్వీ కౌండిన్య తెరచాప నౌక తన తొలి విదేశీ సముద్ర ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకుని ముంబై హార్బర్ కు చేరుకుంది. ఈ సందర్బంగా ముంబై హార్బర్‌లో INSV కౌండిన్య ఫ్లాగ్-ఇన్ వేడుకను ఇండియన్ నేవీ ఘనంగా నిర్వహించింది.
INSV కౌండిన్య నౌక డిసెంబర్ 29, 2025న గుజరాత్ పోర్‌బందర్ నుండి బయలుదేరిన ప్రాచీన నావికులు ప్రయాణించిన సముద్ర మార్గాల్లోనే వెళ్లి ఈ ఏడాది జనవరి 14న ఒమన్‌లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్‌కు చేరుకుంది. అక్కడ ఒమన్ ప్రముఖులు, ప్రవాస భారతీయులు ఈ నౌకకు ఘనస్వాగతం పలికారు. అరేబియా సముద్రం గుండా సాగిన ఈ చారిత్రాత్మక నౌక యాత్ర భారత్-ఒమన్ దేశాల మధ్య సముద్ర సంబంధాలను మరింత బలోపేతం చేసింది. ఒకప్పుడు అరేబియా సముద్రం మీదుగా రెండు దేశాల మధ్య జరిగిన సుగంధ ద్రవ్యాలు, వ్రస్తాల వాణిజ్య వైభవాన్ని, ఉమ్మడి సముద్రయాన సంప్రదాయాలను ఈ నౌక మరోసారి గుర్తు చేసింది.
5వ శతాబ్ధపు అజంతా గుహ చిత్రాలలోని ప్రాచీన నౌక ప్రేరణతో కేరళకు చెందిన సాంప్రదాయ పడవల తయారీ నిపుణులు, ఆధునిక ఇంజనీర్లు కలిసి కొబ్బరి పీచుతో కూడిన తాళ్లు అల్లికలు, చెక్కపలకలు ఉపయోగించి “స్టిచ్డ్ షిప్”(కుట్టిన ఓడ)పద్దతిలో తెరచాపను పునఃసృష్టి చేశారు. ఎలాంటి ఇంజన్, ఆధునిక లోహ పరికరాలు, మేకులు వినియోగించకుండా దీనిని తయారు చేశారు. సహజ రెసిన్, పత్తి, నూనెలను ఓడ నిర్మాణంలో వాడారు. కేవలం గాలి శక్తితో తెరచాపల సహాయంతో ఈ ఓడ పనిచేస్తుంది. భారత్ దేశానికి చెందిన ప్రాచీన భారతీయ సముద్ర యాత్రికుడు ,క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి చెందిన కౌండిన్య పేరును ఈ ఓడకు నామకరణం చేశారు.
తెరచాపలపై కదంబ రాజవంశం యొక్క రెండు తలల గండభేరుండం, సూర్యుడి చిత్రాలు, ఓడ ముందు భాగంలో సింహ యాలి శిల్పం, విల్లుపై ఉన్న పౌరాణిక సింహ ప్రతిమ, ఓడ డెక్ మీద హరప్పా శైలి రాతి లంగరు వంటి ప్రాచీన భారతదేశపు సముద్రయాన సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా ఏర్పాటు చేశారు.
భారతదేశం-ఒమన్ మధ్య ప్రాచీన సముద్ర మార్గాలను, సంస్కృతిని కౌండిన్య సముద్ర మార్గ ప్రయాణం పునరుజ్జీవింపజేసిందని, ఆనాటి ప్రాచీన సముద్ర మార్గంలోనే ఈ ఓడ తన ప్రయాణాన్ని పూర్తి చేసి విజయవంతంగా తిరిగొచ్చిందని నేవీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :
Ayatollah Khamenei : ఖమేనీ మరణం..ఆ మహిళల వీడియోలు వైరల్
సూర్యాపేట జిల్లాలో మైనింగ్ స్కామ్ : సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram