Indian Constitution Book As Return Gift At Wedding | కూతురు పెళ్లిలో రాజ్యాంగమే రిటర్న్‌ గిఫ్ట్‌

కూతురు పెళ్లిలో రాజ్యాంగం బుక్‌ను రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన హైదరాబాదు లాయర్‌.. సామాజిక అవగాహనకు కొత్త దిశ చూపించారు.

Indian Constitution Book As Return Gift At Wedding | కూతురు పెళ్లిలో రాజ్యాంగమే రిటర్న్‌ గిఫ్ట్‌

హైదరాబాద్, అక్టోబర్‌ 29 (విధాత ప్రతినిధి):ఇప్పుడు పెళ్లిళ్లు వైభవంగా, ఆడంబరంగా జరుపుకోవడం సాధరణమైంది. బహుమతులు, రిటర్న్‌ గిఫ్ట్‌లు, అలంకారాలు ఇవన్నీ పెళ్లి సంస్కృతిలో భాగమయ్యాయి. కానీ హైదరాబాద్ కు చెందిన అడ్వకేట్‌ విశాఖ మాధవ కృష్ణారెడ్డి, సరిత దంపతులు మాత్రం ఈ ఆచారాలకు భిన్నంగా ఆలోచించారు. తమ కూతురు ఆశృతరెడ్డి వివాహ వేడుకలో రిటర్న్‌ గిఫ్ట్‌గా భారత రాజ్యాంగం బుక్ అతిథులకు రిటర్న్ గిఫ్ట్ గా అందించారు.

సాధారణంగా పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు కొత్త దంపతులను ఆశీర్వదిస్తారు. భోజనం చేసి తిరుగు ప్రయాణం అవుతారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లతో పాటు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. అడ్వకేట్ వృత్తిలో ఉన్న కృష్ణారెడ్డి తన కూతురు పెళ్లికి భారత రాజ్యాంగాన్ని రిటర్న్ గిఫ్ట్ గా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భోజనం ముగించుకొని ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లే మార్గం వద్ద అతిథులకు ఈ రాజ్యాంగం బుక్ ను అందించారు. 408 పేజీలతో ఈ బుక్ ఉంది. కానీ, కృష్ణారెడ్డి తన కూతురు పెళ్లిలో రాజ్యాంగం బుక్ ను రిటర్న్ గిఫ్ట్ గా అతిథులకు పంచడం ద్వారా ఈ పెళ్లికి వచ్చిన అతిథులు కృష్ణారెడ్డి ఆలోచనను అభినందించారు.

కృష్ణారెడ్డి అంబేద్కర్ వాది. అంబేద్కర్ ఆలోచనల్లో నడవడంలో భాగంగా కృష్ణారెడ్డి తన కూతురు పెళ్లికి రాజ్యాంగ్ బుక్ ను రిటర్న్ గిఫ్ట్ గా అందించారు. ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది.

గతంతో పోలిస్తే వివాహాల్లో ఖర్చులు ఎక్కువ అయ్యాయి. ఒకరిని చూసి మరొకరు పోటీపడి పెళ్లిళ్లకు ఖర్చులు చేస్తున్నారు. రిటర్న్ గిఫ్టులే కాదు, పెళ్లి జరిగే మండపంతో పాటు ఆ ప్రాంతం డెకరేషన్ , పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసే భోజనంలో రకరకాల వంటకాలు వడ్డించడం, ఆర్కెస్ట్రా , రిటర్న్ గిఫ్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంటుంది. పెళ్లిలో చేసిన ఖర్చు గురించి నలుగురు మాట్లాడుకోవాలనేది తాపత్రయం కనిపిస్తోంది.

ఇది తన జీవితంలో అందుకున్నఅద్బుతమైన బహుమతి అని పెళ్లికి వచ్చిన వెంకట్ రెడ్డి అనే అతిథి ఒకరు అన్నారు. దేశంలో బహుశా ఇలా రాజ్యాంగం బుక్ ను రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడం బహుశా ఇదే తొలిసారి అయి ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, బాధ్యతల ఆరంభం కూడా. ప్రతి కుటుంబంలో రాజ్యాంగ విలువలు సజీవంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన ప్రజాస్వామ్యం బలపడుతుందని కృష్ణారెడ్డి అన్నారు.