BRS Mata Muchata Campaign | జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ‘మాట-ముచ్చట’తో వినూత్న ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ వినూత్న ‘మాట-ముచ్చట’ ప్రచారం ప్రారంభించి ప్రజలతో నేరుగా చర్చిస్తూ విజయానికి బాటలు వేస్తుంది.

BRS Mata Muchata Campaign | జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ‘మాట-ముచ్చట’తో వినూత్న ప్రచారం

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీతో పోరాడుతూ తమ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం సర్వశక్తులొడ్డుతుంది. ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు ల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో పాటు ఇంకోవైపు ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తుంది. సోషల్ మీడియా వింగ్ ప్రచారం ఉండనే ఉంది. వాటన్నింటికి తోడుగా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ విజయం కోసం ఆ పార్టీ నాయకత్వం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ‘మాట-ముచ్చట’ పేరుతో బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లోని ప్రజలతో నేరుగా మాట్లాడే కార్యక్రమాలు ప్రారంభించారు. తొలి రోజున టీ దుకాణాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‘మాట-ముచ్చట’ కార్యక్రమంతో ప్రచారం

‘మాట-ముచ్చట’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతలు అంతా ఎక్కడికక్కడ తమకు కేటాయించిన డివిజన్లు, బూత్‌లలో ఈ మాట ముచ్చట కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఈ ‘మాట-ముచ్చట’ వేదికగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వారు ప్రస్తావిస్తారు. వీటితో పాటు, హైదరాబాద్ నగర అభివృద్ధి కుంటుపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా వారు ప్రజలతో చర్చిస్తారు. కాంగ్రెస్ పార్టీ యొక్క 24 నెలల పాలనా వైఫల్యాలను మరియు ప్రభుత్వ పనితీరును ఈ ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమంతో ప్రయత్నించనుంది. అలాగే బీఆర్ఎస్ పాలనా విజయాలను ఏకరవు పెట్టనుంది. తద్వారా ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ప్రయత్నిస్తారు.