Municipal Elections | మున్సి‘పోల్స్‌’.. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక?

మున్సిపోల్స్‌.. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోకపోతే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితులను చవి చూసే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Municipal Elections | మున్సి‘పోల్స్‌’.. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక?
  • మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తానికి బొటాబొటీ ఫలితాలు
  • మున్సిపాల్టీల్లో సగం వార్డులకే పరిమితం
  • కార్పొరేషన్లలో అంతంత మాత్రమే
  • పట్టణ ప్రజల్లో వ్యతిరేకతకు సంకేతమా?

విధాత, హైదరాబాద్ :
Municipal Elections | తెలంగాణలో తాజాగా ముగిసిన మున్సిపల్‌ ఎన్నికలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మున్సిపాల్టీలలో కాంగ్రెస్‌ నేతలు చెప్పిన 90 శాతం సంగతి పక్కన పెడితే.. 50 శాతం వార్డులు గెలవడమే ఆ పార్టీకి గగనంగా మారిందని గణాంకాలను చూపుతున్నారు. కార్పొరేషన్లలో ఇంతకంటే నిరాశాజనకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టంచేస్తున్నారు. ఏడు కార్పొరేషన్లలో 411 డివిజన్లకు గాను.. 191 డివిజన్లు.. అంటే 46.4 శాతం డివిజన్లను మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందగా.. మిగిలిన డివిజన్లలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న విషయాన్ని గుర్తించాలంటున్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ఈ కాస్త ఫలితాలూ ముఖ్యమంత్రి మొదలుకొని.. మంత్రులు, కింది స్థాయి నాయకుల వరకూ అహర్నిశలు కష్టపడితే, అందులోనూ అధికారం అండ ఉన్నది కాబట్టే గెలిచిన విషయాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం గమనంలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. నిజానికి ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తొలి ప్రమాద హెచ్చరికగా అభివర్ణిస్తున్నారు. ఆశించిన ఫలితాలు రాబట్టుకోవడంలో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. బొటాబొటీ సీట్లతోనే సరిపెట్టుకున్నదని విశ్లేషిస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వంపై ప్రజల్లో క్రమంగా పెరుగుతున్న వ్యతిరేకతకు ఇది సంకేతమని అంటున్నారు. విజయాలను చూసి పొంగిపోవడం కాకుండా.. అసలైన అపజయాలను విశ్లేషించుకోని పక్షంలో ఒకప్పుడు బీఆరెస్‌ అధికారంలో ఉండి.. లోక్‌సభ ఎన్నికల్లో చతికిల పడిన పరిస్థితి భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 120 మున్సిపాల్టీలకుగాను 112 మున్సిపాల్టీలను గెలుచుకుంది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ 13 మున్సిపాల్టీల్లో ఆధిక్యం ప్రదర్శించింది.

ఈసారి 116 మున్సిపాల్టీల్లో అధికార కాంగ్రెస్ 66 మున్సిపాల్టీలను మాత్రమే దక్కించుకోగా బీఆర్ఎస్ 13 మున్సిపాల్టీల్లో పాగా వేసింది. 116 మున్సిపాల్టీల్లో మొత్తం వార్డులు 2,581 ఉండగా వీటిలో కాంగ్రెస్ 1,349 వార్డులు (52 శాతం), బీఆర్ఎస్ 718 వార్డులను (27.8 శాతం) దక్కించుకున్నాయి.

ఏడు కార్పొరేషన్లలో 411 డివిజన్లు ఉండగా ఇందులో 191 డివిజన్లు (46.4 శాతం) గెలుపొందగా, 63 వార్డులు (15.3 శాతం) బీఆర్ఎస్ గెలుపొందింది. మున్సిపాల్టీల్లోని మొత్తం వార్డులలో సగానికి కొద్దిగా ఎక్కువగా, నగరాల్లో సగానికి నాలుగు శాతం తక్కువగా డివిజన్లను గెలుపొంది తమదే విజయం అని డాంబికాలు పలుకుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తరచిచూస్తే ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ పనితీరును పట్టణ ఓటర్లు సంపూర్ణంగా అంగీకరించడం లేదని అంటున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల పట్టణ ఓటర్లు వ్యతిరేకంగా వ్యవహరించరు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఫలితాలు చూస్తే అర్థమవుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అత్యుత్తమ ఫలితాలు సాధించింది. 120 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా 112 (93.33 శాతం) మున్సిపాల్టీల్లో పాగా వేసి పట్టును నిరూపించుకున్నది. కేవలం పద్దెనిమిది మున్సిపాల్టీలను మాత్రమే ప్రతిపక్ష పార్టీలు దక్కించుకున్నాయి. ఇందులో కాంగ్రెస్ నాలుగు (3.33 శాతం), బీజేపీ రెండు (1.66 శాతం) మున్సిపాల్టీల చొప్పున దక్కించుకోగా, రెండింట్లో హంగ్ వచ్చింది. ఈసారి ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే 116 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా 66 మున్సిపాల్టీల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఇందులో 26 పట్టణాల్లో బొటాబొటి సీట్లతో పీఠాలను దక్కించుకున్నది. 14 పట్టణాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఎన్నడూ లేని విధంగా 36 మున్సిపాల్టీల్లో హంగ్ ఫలితాలు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులు కంగుతిన్నారు. ధన ప్రవాహం, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, మందు ఏరులై పారినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు. ఇంతగా శ్రమిస్తే 66 మున్సిపాల్టీలు, మూడు కార్పొరేషన్లు మాత్రమే కైవసం చేసుకున్నామా అని కాంగ్రెస్‌ నేతలు మథనపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. నాలుగు కార్పొరేషన్లలో హంగ్ రావడంతో ఎవరు కైవసం చేసుకుంటారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సాధించిన మున్సిపాల్టీలను, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దక్కించుకోవడంలో ఘోరంగా విఫలమైందంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు దాటిపోయింది. కానీ.. పట్టణాలకు నిధులు విదల్చలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నది. మరోవైపు మున్సిపల్ శాఖను రేవంత్ రెడ్డి తనవద్దే పెట్టుకోవడం మూలంగా పాలన గాడి తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పారిశుధ్యం, నీటి సరఫరా, రోడ్ల నిర్వహణ, డ్రైనేజీ, వీధిలైట్ల నిర్వహణలో వైఫల్యాలే ఓటరు మద్దతు లభించకపోవడానికి కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడం, రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వకుండా సచివాలయం చుట్టూ తిప్పించుకోవడం కూడా కారణంగా చెబుతున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం వరకు సీట్లు దక్కించుకుంటుందని, దానికి విరుద్ధంగా ఈ ఫలితాలు ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 116 మున్సిపాల్టీల్లో 52 శాతం మించి వార్డులను దక్కించుకోలేకపోయారంటే పట్టణ ఓటర్లలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టంగా కన్పిస్తున్నదని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 90 శాతం వార్డులను సాధిస్తామని ఎన్నికలకు ముందు బీరాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఫలితాలను చూసి కంగుతిన్నారనే వార్త గాంధీ భవన్ లో చక్కర్లు కొడుతున్నది.

పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే నెలలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంతకు మించి ఫలితాలు వచ్చే అవకాశం లేదన్న చర్చలు గాంధీభవన్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా విషయాల్లో గ్రామీణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇప్పటికైనా సమీక్షించుకుని ముందుకు వెళ్లకపోతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ చతికలపడే అవకాశాలు లేకపోలేదని చర్చించుకున్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్న బీజేపీ గత కన్నా కాస్త మెరుగ్గానే ఫలితాలు సాధించిందని ఆ పార్టీ నాయకులు చెప్పకొంటున్నారు. మున్సిపాల్టీలలో 260 వార్డులు (10 శాతం), నగరాల్లో 75 డివిజన్లు (18.2 శాతం) బీజేపీ గెలుచుకుంది. గతంలో 239 వార్డులు, డివిజన్లలో గెలుపొందగా ఈసారి ఆ సంఖ్య 335కు పెరిగింది. అయితే 43 మున్సిపాల్టీల్లో కనీసం ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోయింది. చైతన్యభరితమైనవిగా చెప్పే వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లల్లో బీజేపీకి ఒక్క వార్డు కూడా లభించలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రమే అదిలాబాద్ మున్సిపాల్టీలో మెరుగైన ఫలితం సాధించారు. ఇద్దరు సీఎం అభ్యర్థులను గత ఎన్నికల్లో ఓడించిన ఎమ్మెల్యే కే వెంకటరమణా రెడ్డి, కామారెడ్డి మున్సిపాల్టీలో 49 వార్డులకు గాను18 మాత్రమే గెలిపించారు. నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ మున్సిపాల్టీలో మొత్తం 42 వార్డులకు గాను 13 స్థానాలను మాత్రమే గెలిపించుకోగలిగారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపాల్టీలో 36 వార్డులలో 8 స్థానాలను మాత్రమే దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతరులు మున్సిపాల్టీల్లో 254 వార్డులు (9.8 శాతం), నగరాల్లో 82 డివిజన్లు (19.9 శాతం) గెలుపొందారు. ఇతరులలో సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, రెబెల్స్‌, స్వతంత్రులు ఉన్నారు.

మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు 2581
కాంగ్రెస్‌ 1349 (52%)
బీఆరెస్‌ 718 (27.8%)
బీజేపీ 260 (10%)
ఇతరులు 254 9.8%

కార్పొరేషన్లలో మొత్తం డివిజన్లు 411
కాంగ్రెస్‌ : 191 (46.4%)
బీఆరెస్‌ : 63 (15.3%)
బీజేపీ : 75 (18.2%)
ఇతరులు : 82 (19.9%)

ఇవి కూడా చదవండి..

Dry Cleaning Shop | ఇస్త్రీ చేస్తూ నెల‌కు రూ.2.8ల‌క్ష‌ల సంపాదన‌.. ఐటీ ఉద్యోగుల‌కు కూడా ఇంత జీతం రాదేమో..!
Engine Explosion | 27 వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్క‌సారిగా పేలిన‌ ఇంజిన్
10 month old Alin saves five lives | ప్రాణ‌దాత‌.. ఐదుగురికి జీవితాన్ని ప్ర‌సాదించిన 10 నెల‌ల‌ చిన్నారి