Durgam Cheruvu | దుర్గం చెరువు కబ్జా జరిగిందిలా : బయటపెట్టిన హైడ్రా
దుర్గం చెరువులో దశాబ్దాలుగా జరిగిన ఆక్రమణలను శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడింది. 160 ఎకరాల నుంచి 116 ఎకరాలకు ఎలా తగ్గిందో పూర్తి వివరాలను హైడ్రా విడుదల చేసింది.
How Durgam Cheruvu Was Encroached: HYDRAA Reveals Satellite Evidence
- శాటిలైట్ చిత్రాలతో దశాబ్దాల ఆక్రమణల పర్వం బట్టబయలు
- 1976 నాటికే 29 ఎకరాలు కబ్జా
- ఈనాటి వరకు మొత్తం 44 ఎకరాలు
- బిఆర్ఎస్ ఎమ్మేల్యేపై కేసు – ఖండన
విధాత సిటీ బ్యూరో | హైదరాబాద్:
Durgam Cheruvu | హైదరాబాద్ నగరంలోని చారిత్రక దుర్గం చెరువు కబ్జాల చరిత్రను హైడ్రా (HYDRAA) బహిర్గతం చేసింది. ఒకప్పుడు సుమారు 160 ఎకరాల విస్తీర్ణంతో విస్తరించిన ఈ చెరువు, దశాబ్దాలుగా జరిగిన అక్రమ ఆక్రమణల వల్ల ప్రస్తుతం కేవలం 116 ఎకరాలకు పరిమితమైందని హైడ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సహకారంతో పొందిన శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది.
హైడ్రా వెల్లడించిన గణాంకాల ప్రకారం—
1976 నాటికే దుర్గం చెరువులో 29 ఎకరాలు ఆక్రమణకు గురై విస్తీర్ణం 131.66 ఎకరాలకు తగ్గింది. ఆ తరువాత 1995 వరకు పెద్దగా మార్పుల్లేకపోయినా, 1995 నుంచి 2000 మధ్య మరో 10 ఎకరాలు కబ్జాకు గురై 121 ఎకరాలకు పడిపోయింది. 2000 సంవత్సరం తర్వాత ఇప్పటివరకు మరో 5 ఎకరాల మేర చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు శాటిలైట్ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
గోల్కొండ కోట నివాసులకు ఒకప్పుడు తాగునీరు అందించిన ఈ రహస్య తటాకం(Secret Lake), నగర విస్తరణ పేరుతో క్రమంగా కబ్జాదారుల చెరలో చిక్కుకుపోయిందని హైడ్రా అధికారులు తెలిపారు.
మాదాపూర్ వైపు 5 ఎకరాల కబ్జా తొలగింపు
- పార్కింగ్ దందాకు చెక్ – కేసు, ఖండన

దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వైపు సుమారు 5 ఎకరాల చెరువు భూమిని మట్టితో నింపి అక్రమంగా వాహనాల పార్కింగ్‌గా మార్చిన వ్యవహారాన్ని హైడ్రా మంగళవారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆక్రమణలను నిర్ధారించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో 10 నుంచి 15 మీటర్ల మేర మట్టిని పోసి చదును చేసి, స్కూల్ బస్సులు, ఐటీ కంపెనీల వాహనాలకు పార్కింగ్‌గా ఉపయోగిస్తూ నెలకు సుమారు రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి భూ రికార్డులు లేకుండానే ఈ అక్రమ దందా సాగుతున్నట్టు హైడ్రా పేర్కొంది.
ఈ వ్యవహారంలో హైడ్రా ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఖండించారు. దుర్గం చెరువులో తనకు ఎలాంటి భూమి లేదని, ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. కేసుపై న్యాయపరంగా పోరాడతానని తెలిపారు.

ఇదిలా ఉండగా, హైడ్రా అధికారులు ఆక్రమిత స్థలాన్ని ఫెన్సింగ్ చేసి, చెరువులో నింపిన మట్టిని పూర్తిగా తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా దుర్గం చెరువు అసలు సరిహద్దులను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram