• Telugu News
  • /Hyderabad

Flyovers at IIIT Junction | ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద మూడు ఫ్లైవోవర్లు.. ఐటీ కారిడార్‌కు బిగ్‌ రిలీఫ్‌

ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు త్వరలో ఫుల్‌ స్టాప్‌ పడనుంది. తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌లకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో మూడు ఫ్లైవోవర్లు, ఒక అండర్‌పాస్‌ను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్నది. ఇవి పూర్తయితే.. సిగ్నల్‌ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి రానుంది.

Reported by: Jagan Mohan Talluri | హైదరాబాద్​ | Feb 11, 2026, 7:00 pm IST
Read Time: 5 mins
Flyovers at IIIT Junction | ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద మూడు ఫ్లైవోవర్లు.. ఐటీ కారిడార్‌కు బిగ్‌ రిలీఫ్‌

Flyovers at IIIT Junction | హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద ఏకకాలంలో మూడు ఫ్లైవోవర్ల నిర్మాణం వేగం పుంజుకుంటున్నది. సుమారు 800 కోట్ల రూపాయలను ఈ ఫ్లైవోవర్ల కోసం జీహెచ్‌ఎంసీ వెచ్చిస్తున్నది. 2028 మే నాటికి పూర్తికానున్న ఈ ఫ్లైవోవర్లతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ కష్టాల నుంచి రిలీఫ్‌ లభించనుంది. మూడు ఫ్లైవోవర్లకు గాను.. లెవల్‌ 1 ఫ్లైవోవర్‌.. ఐఎస్‌బీ రోడ్డు నుంచి డీఎల్‌ఎఫ్‌ రోడ్డు వైపు రెండువైపులా రాకపోకలకు ఉద్దేశించి నిర్మించనున్నారు. లెవల్‌ 2 ఫ్లైవోవర్‌ను డీఎల్‌ఎఫ్‌ రోడ్డు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు (వన్‌ వే) నిర్మించనున్నారు. మూడో ఫ్లైవోవర్‌ను ఐఎస్‌బీ రోడ్డు నుంచి ఇందిరానగర్‌ వైపు నిర్మిస్తారు. అదే సమయంలో ఇందిరా నగర్‌ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు రెండు వైపులా రాకపోకలకు వీలుగా అండర్‌పాస్‌ నిర్మించనున్నారు.

ఈ ఫ్లైవోవర్ల కోసం తవ్వకం పనులు వేగంగా చేపడుతున్నారు. ఐఎస్‌బీ వద్ద పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. గత కొద్ది నెలలుగా భూమి పరీక్షలు పూర్తి కావడంతో భారీ మెషినరీని ఉపయోగించి.. తవ్వకాలు చేపడుతున్నారు. ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద పిల్లర్‌ పనులు కూడా సాగుతున్నాయి.

multi-level flyovers Hyderabad IT corridor

ప్రస్తుతం ఈ ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ.. సాయత్రం 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ట్రాఫిక్‌ కష్టాలు వర్ణనాతీతం. గత ఏడాది వర్షాకాలం సమయంలో ఆ ప్రాంతంలోని రోడ్లు నీట మునగడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆ సమయంలో విధులు ముగించుకుని ఇళ్లకు తిరుగు పయనమైన ఐటీ ఉద్యోగులు వందల మంది గచ్చిబౌలి నుంచి లింగం పల్లి, జేఎన్‌టీయూ, మెహదీపట్నం వరకూ మూడు నుంచి నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకొని పోయారు.

ఈ నేపథ్యంలో ఇక్కడి ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. దాదాపు 800 కోట్ల రూపాయలు వెచ్చించి.. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద మూడు ఫ్లైవోవర్లు, ఒక డెడికేటెడ్‌ అండర్‌పాస్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. వాహనదారులు ఎక్కడా ట్రాఫిక్‌ సిగ్నల్‌ లేకుండా తమ ప్రాంతాలకు సత్వరమే చేరుకోవచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. సమయం ఆదా అవడమే కాదు.. ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోతుందని అంటున్నారు. మూడు ఫ్లైవోవర్లు, ఒక అండర్‌పాస్‌ను 2028 మే నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు సాగుతున్నాయని అధికారుల చెబుతున్నారు.