Heavy Rains Lash Hyderabad : హైదరాబాద్ లో కుండపోత వాన
హైదరాబాద్‌లో మూడు గంటల కుండపోత వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్ జామ్, హుస్సేన్ సాగర్ నీటి మట్టం పెరిగింది.

విధాత, హైదరాబాద్ : వరుస వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం మూడు గంటల పాటు నగర వ్యాప్తంగా కుండపోత వానలు దంచికొట్టాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల నుంచి నగర వాసులు తేరుకోకముందే మరోసారి భారీ వర్షాలు పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. చాలచోట్ల రోడ్లన్ని జలమయమవ్వడంతో ట్రాఫిక్ జామ్ సమస్య జఠిలంగా మారింది. దీంతో వాహనదారులు రోడ్లపై ముందుకు కదిలేందుకు నానాపాట్లు పడ్డారు.
నగరంలోని ఎల్బీనగర్, ఉప్పల్, హయత్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కూకట్ పల్లి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, , గచ్చిబౌలి, మూసాపేట్, నిజాంపేట, మియాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో వరద నీటితో జనం ఇబ్బంది పడ్డారు. నాలాలు పొంగి పొర్లడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. సెక్రటేరియట్ ఎదురుగా భారీగా వర్షం నీరు నిలిచింది. హుస్సెన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో అధికారులు దిగువకు నీటి విడుదల చేపట్టారు. మూడు గంటల పాటు రాత్రి కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో నగరవాసులు ఇండ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.