కాలనీలో.. డిగ్రీ కాలేజీ నిర్వహణను వ్యతిరేకిస్తూ ధర్నా

హబ్సిగూడ నవోదయ కాలనీలో ఆదిత్య డిగ్రీ కాలేజీ ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్, పార్కింగ్, భద్రత సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్, హబ్సిగూడ: హబ్సిగూడలోని నవోదయ కాలనీ స్ట్రీట్ నెం. 8లో ఇరుకైన నివాస ప్రాంతంలో ఆదిత్య డిగ్రీ కాలేజీ ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు సోమవారం ఉదయం ధర్నా నిర్వహించారు.ఇరుకైన సందులో ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు, అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగించడం వల్ల కాలనీవాసుల భద్రత, ప్రశాంతత దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు.

ఈ సమస్యపై ఇప్పటికే సంబంధిత ప్రభుత్వ శాఖలు, జీహెచ్‌ఎంసీ మరియు ఇతర అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ అధికారులు స్పందించలేదని కాలనీవాసులు ఆరోపించారు. కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.”ఇరుకు సందుల్లో స్కూల్స్, కాలేజీలు వద్దు – నివాస ప్రాంతాలను కాపాడండి” అంటూ నినాదాలు చేస్తూ కాలనీవాసులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని నవోదయ కాలనీ వాసులు హెచ్చరించారు.

Latest News