హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే క్రమంలో మరో కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. హైదరాబాద్‌ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ నుండి లక్డీకాపూల్ మీదుగా మసబ్ ట్యాంక్, ఖైరతాబాద్‌లకు చేరేందుకు 1.5 కి.మీల Y-ఆకారపు ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. ఎటువంటి ప్రైవేట్ భూసేకరణ లేకుండా నిర్మించే ఈ ఫ్లైఓవర్ తూర్పు-పశ్చిమ ప్రాంతాల అనుసంధానాన్ని పెంచి ట్రాఫిక్ రద్దీని భారీగా తగ్గించనుంది. ఈ కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్దం చేసింది.

పబ్లిక్ గార్డెన్ నుంచి అసెంబ్లీ వెనుక వైపుగా లక్డీకాపూల్ వరకు 1.5కిలోమీటర్ల పొడవున వై ఆకారంతో ఫ్లోఓవర్ నిర్మాణానికి హెచ్ఎండీఏ డిజైన్ సిద్దం చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే సర్వే పూర్తి చేసింది. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ముందు నుంచి పబ్లిక్ గార్డెన్ మీదుగా అసెంబ్లీ వెనుక వైపు నుంచి రైల్వే లైన్ వెంట ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తారు. లక్డీకాపూల్ వద్ద ఫ్లైఓవర్ రైల్వై లైన్ మీద నుంచి లక్డీకాపూల్ జంక్షన్ దాటనుంది.

ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ రెండు వై ఆకారంలో రెండుగా చీలిపోయి ఒక మార్గం మాసబ్ ట్యాంకు వైపు, మరో మార్గం ఖైరతాబాద్ వైపు రోడ్డుకు అనుసంధాం కానుంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు ముందే ఈ ఫ్లైవర్ ప్రధాన రహదారికి కనెక్ట్ అవుతుంది. ఈ ఫ్లై ఓవర్ పై నాంపల్లి నుంచి వచ్చే వాహనదారులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఖైరతాబాద్ , మాసబ్ ట్యాంకు నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేకుండా ఇది వన్ వేగా నిర్మాణం కానుంది.