Bamruk Ud Daulah Lake | హైడ్రా చొరవ…బమృక్నుద్దౌలా చెరువు పునరుద్ధరణ
హైడ్రా చొరవతో బమృక్నుద్దౌలా చెరువు పునరుద్ధరణ వేగం! చారిత్రక చెరువుకు మళ్లీ జీవం పోస్తున్న అధికారులు.
విధాత : జంటనగరాల్లోని చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై దండయాత్ర సాగిస్తున్న హైడ్రా..కబ్జాలతో కనుమరుగైపోతున్న చెరువులను పరిరక్షిస్తూ పునరుద్దరణతో జీవం పోస్తుంది. బతుకమ్మ కుంట చెరువు పునరుద్దరణతో అందరి దృష్టిని ఆకట్టుకున్న హైడ్రా తాజాగా పాతబస్తీలోని బమృక్నుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులను వేగంగా కొనసాగిస్తుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ చెరువు పునరుద్దరణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నవంబరు నాటికి చెరువు పునరుద్దరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న పాతబస్తీలోని చారిత్రక బమృక్నుద్దౌలా చెరువు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది నవంబరు నెలాఖరు నాటికి జాతి సంపదగా భావితరాలకు అందిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాధ్ పేర్కొన్నారు. చెరువు ఆక్రమణలను గత ఏడాది ఆగస్టు నెలలో తొలగించినట్టు చెప్పారు. 18 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు కేవలం 4.12 ఎకరాలకు పరిమితమైపోగా.. ఆక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు చెరువును 18 ఎకరాల మేర విస్తరించి.. వరద కట్టడితోపాటు.. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని హైడ్రా కమిషనర్ చెప్పారు. చెరువులోకి వరద నీరు చేరేలా.. నిండితే బయటకు పోయేలా నిర్మించిన ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
చరిత్ర ఎంతో ఘనం
బమృక్నుద్దౌలా చెరువును 1770లో హైదరాబాదు మూడవ నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్‌ఉద్‌దౌలా నిర్మించాడు. చారిత్రక ఆనవాళ్లు ప్రకారం వంద ఎకరాలకు పైగా ఈ చెరువు విస్తరించి ఉండేదని.. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదని ఇక్కడి పెద్దల కథనం. నిజాంల కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమృక్నుద్దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని చెబుతున్నారు. అలాగే బమృక్నుద్దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు వినియోగించేవారని మరి కొంతమంది వివరిస్తున్నారు. ఔషధగుణాలున్న ఈ నీటిని మాత్రమే నిజాంలు వినియోగించేవారంటున్నారు. అంతే కాదు.. ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని.. ఇందుకోసం అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లేవారంటున్నారు. ఇలా ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పునరుద్ధరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు సంబర పడుతున్నారు.
సుందరీకరణ పనులతో కొత్త హంగులు
బమృక్నుద్దౌలా చెరువు చుట్టూ బండ్ నిర్మించి వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. అలాగే చెరువు కట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు. చెరువు లోపలి వైపు కూడా ఎవరూ లోనకు వెళ్లకుండా గట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ఆట స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వృద్ధులు సేద దీరే విధంగా అక్కడ సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పార్కులు నిర్మిస్తున్నారు. ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ రహదారులు నిర్మించడంతో పాటు.. గ్రీనరీని పెంచే విధంగా మొక్కలు నాటుతున్నారు. పచ్చిక బైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే.. నగిషీలు చెక్కుతున్నారు. నిజాంల కాలంలో రాతితో నిర్మించిన బండ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుతూ.. మరింత పటిష్టం చేస్తున్నారు. చెరువులో కూడా మట్టిలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరుస్తున్నారు. ఔట్‌లెట్‌కు మళ్లీ గేట్లు బిగిస్తున్నారు. స్థానిక నివాసితులు అక్కడకు వచ్చి సేదదీరేవిధంగా రూపొందించడమే కాకుండా.. సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram