Brilliant Engineering College | బ్రిలియంట్ కోటి కొట్టేసింది..ప్రభాకరేనా?
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ కాలేజీలో జరిగిన రూ.1.07 కోట్ల చోరీ కేసులో బత్తుల ప్రభాకర్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హస్తం ఉన్నట్లు పోలీసులు సీసీటీవీ ఆధారంగా అనుమానిస్తున్నారు.

విధాత : బ్రిలియంట్ కాలేజీలో సేఫ్ లాకర్స్ ను బద్దలు కొట్టి కోటి రూపాయల నగదు చోరీ చేసిన ఘటపై పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందిన బ్రిలియంట్ కాలేజీలో రూ.1.07కోట్ల చోరీ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కేసు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా చోరీకి పాల్పడింది ఒకే ఒక్కడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ ఒక్కడు ‘మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్’ అని అనుమానిస్తున్నారు. అయితే చోరీ చేసింది ప్రభాకర్ అన్న సంగతిని మాత్రం పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
ప్రభాకర్ పై రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులున్నాయి. కొంతకాలం క్రితమే.. కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులకు బురిడీ కొట్టిం ఉడాయించాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ప్రభాకర్ మాత్రం చిక్కడు దొరకడు మాదిరిగా తన చోరీలను నిరాటంకంగా చేసుకుంటూ వెలుతున్నాడు. బ్రిలియంట్ కాలేజీ నగదు చోరీ కేసును రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ అనూరాధ, క్రైం డీసీపీ అరవింద్, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు.