Kompella Madhavi Latha : జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ రేసులో మాధవీలత !
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ రేసులోకి పార్టీ నాయకురాలు కొంపల్లి మాధవీలత అనూహ్యంగా వచ్చారు. ఆమె పేరును రాష్ట్ర కమిటీ పరిశీలిస్తోంది.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ టికెట్ రేసులోకి పార్టీ నాయకురాలు కొంపల్లి మాధవీలత అనూహ్యంగా దూసుకొచ్చారు. ఇప్పటిదాక టికెట్ రేసులో ఉన్న లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆరుల విజయ, అట్లూరి రామకృష్ణల పేర్లకు తోడుగా మాధవీలత పేరును కూడా రాష్ట్ర కమిటీ పరిశీలిస్తుంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, బీజేపీ సీనియర్ నేత కోమల ఆంజనేయులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వారు పార్టీలోని జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షులు, ఇంచార్జిలు, కౌన్సిలర్లు, తదితర ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ వివరాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డితో త్రిసభ్య కమిటీ చర్చించనుంది. అనంతరం ఆరుగురు పేర్ల నుంచి ముగ్గురి పేర్లను బీజేపీ జాతీయ కమిటీకి పంపించనున్నారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరానికి పార్టీ అవకాశం ఇస్తే తాను సిద్దంగా ఉన్నానంటూ మాధవీ లత ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ నియోజకర్గంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతో పోటీ పడిన మాధవీలత ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో..వారణాసి లోక్ సభ స్థానం ప్రచారంలోనూ మాధవీలత సేవలను వినియోగించుకోవడం విశేషం. ఇటీవల బంజరాహిల్స్ లోని ఓ పురాతన అమ్మవారి ఆలయం కూల్చివేతపై మాధవీలత సాగించిన పోరాటం అప్పట్లో వైరల్ గా మారింది.