మెగా బ్రదర్ నాగబాబు కూతురు నటి, నిర్మాత కొణిదెల నిహారిక బోనం మొక్కు తీరింది.పాతబస్తీలోని మీరాలం మండిలో ఉన్న శ్రీ మహంకాళేశ్వర దేవాలయానికి వెళ్లిన ఆమె..భక్తి శ్రద్దలతో తలపై బంగారు బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిహారిక ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించిన నిహారిక ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. నిహారిక అమ్మవారికి బోనం మొక్కులు చెల్లించుకున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారికను చూసేందుకు ఆలయానికి వచ్చిన భక్తులు, అభిమానులు ఆసక్తి చూపించారు.
అనంతరం నిహారిక మాట్లాడుతూ ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయాను, అందుకే అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేకంగా వచ్చాను. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి బోనాల సమయంలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు నన్ను ఎంతగానో ఆకట్టుకునేవి. కొద్ది రోజుల క్రితమే.. నన్ను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుండేది అని సరదాగా అనుకున్నాను. ఇంత త్వరగా ఆ కోరిక నెరవేరడం అమ్మవారి అనుగ్రహంగానే భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత అని,దివ్యకాంతులతో మెరిసిపోతున్న ఆ తల్లి దర్శనం ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని పేర్కొన్నారు. మరోసారి కూడా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను అని నిహారిక పేర్కొన్నారు.
గత ఏడాది ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి రెండు విభాగాల్లో జాతీయ పురస్కారం దక్కినందుకు ఆమె మొక్కు చెల్లించినట్లు అభిమానులు భావిస్తున్నారు.
