అభివృద్దిని అడ్డుకోకండి.. మూసీ సుందరీకరణకు సహకరించండి: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ సుందరీకరణకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్వాసితులకు పునరావాసం హామీ ఇస్తూ అభివృద్ధి ప్రణాళికలు వివరించారు.

Revanth Reddy

విధాత: హైదరాబాద్ నగర అభివృద్దికి అడ్డుపడకుండా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రాజకీయాలకు అతీతంగా విపక్షాలు సహా అంతా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శాసనమండలిలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ రీవర్ డెవలమెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తామే అని బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పుకున్నారని, వారు ప్రారంభించి వదిలేస్తే… మేం ముందుకు తీసుకెళుతున్నాం అని.. మీకున్న అభ్యంతరమేంటి? ఎందుకు మూసీ ప్రక్షాళనపై రాజకీయం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వండి అని కోరారు. ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి నాకు మీ సూచనలు ఇవ్వడానికి ఇబ్బంది అనుకుంటే… ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తానని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుతో ఒక కమిటీ వేస్తాం అని,
మీ సలహాలు, సూచనలను కమిటీకి సమర్పించండి అని రేవంత్ రెడ్డి సూచించారు.

మూసీపరివాహక ప్రజలకు సీఎం భరోసా

మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఎవరినీ నిరాశ్రయులను చేయం…. పునరావాసం కల్పిస్తానని మీ ద్వారా ప్రభుత్వం మాట ఇస్తుంది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్కరికీ నష్టం చేయకుండా నిర్వాసితులకు మెరుగైన వసతులు కల్పిస్తాం అన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని, మా అధికారులు మీకు సహాయం అందిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించి… అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు.

సిటీ మధ్య నుంచి అన్ని ప్రాంతాలకు ఎలివేటెడ్‌ కారిడార్లు

దేశంలో ఎన్నో నగరాలున్నా ప్రధానంగా ఐదు నగరాల గురించి మాత్రమే చర్చించుకుంటారని, పొలిటికల్ రాజధానిగా ఢిల్లీ, ఫైనాన్షియల్ కేపిటల్ ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల గురించి చర్చించుకుంటారని, పొలిటికల్ కేపిటల్ గా ఉన్న ఢిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలలకు, ఆఫీసులకి సెలవులు ఇస్తున్నారు అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ముంబై లో వర్షాలు వస్తే వరదలు వచ్చే పరిస్థితి ఉందని, ఫైనాన్షియల్ కేపిటల్ గా ఉన్న ముంబైలో నివసించలేని పరిస్థితి నెలకొందని, బెంగుళూరులో విపరీతమైన ట్రాఫికక్, చెన్నైలో వరదలతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని, అది ఓల్డ్ సైట్ అని మనం చెప్పుకుంటున్నా… అది ఒరిజినల్ సిటీ అని, చార్మినార్, గుల్జార్ హౌస్, శాసన మండలి ఎన్నో చారిత్రక కట్టడాలు నగరంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న నగరంలో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయన్నారు. రవాణాలో రోడ్లు, రైల్వే, ఎయిర్ పోర్టు, పోర్టు కీలకం అని,
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసుకున్నాం, మెట్రోను నిర్మించుకున్నాం అని గుర్తు చేశారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి 29ప్రాంతాల్లో పనులు

సిటీ మధ్య నుంచి రోడ్లను అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ అని మూడు భాగాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం అని, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు 29 ప్రాంతాల్లో జరుగుతున్న పనుల ప్రణాళికలు మీముందు పెట్టాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివెట్ కారిడార్, బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి కూడా అండర్ పాస్ రోడ్డుకు అనుమతి తీసుకొచ్చాం అని, దేశంల్ రన్ వే కింద ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ, విజయవాడ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్లను పూర్తి చేసుకుంటున్నట్లుగా తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట సిటీ మధ్యలో నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నాం అని, గండిపేట నుంచి గౌరెల్లి వరకు కేవలం 40 కిమీ ప్రయాణంతో చేరుకోవచ్చన్నారు.

తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందడుగు

తెలంగాణ అభివృద్దిని తెలంగాణ రైజింగ్ 20147 ప్రణాళిక ద్వారా మూడు జోన్లుగా విభజించుకున్నాం అని, క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించాం అని, ఔటర్ రింగురోడ్డు ఇన్ సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్దిలో భాగంగా 10 వేల స్క్వేర్ కిమీ పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నాం అని, క్యూర్ పరిధిని సర్వీస్ సెక్టార్ గా, ప్యూర్ ను మన్యూఫ్యాక్చార్ హబ్ గా, రెర్ ను అగ్రికల్చర్ రంగంగా అభివృద్ధి చేయబోతున్నాం అన్నారు. ఒక దూర దృష్టితో ప్రణాళికలు రూపొందించినట్లుగా చెప్పారు. పారదర్శకంగా పనులు జరిగేలా ప్రతీ విభాగానికి ఒక పాలసీని తీసుకొచ్చాం అని, ఇప్పుడు మనం దృష్టి సారించాల్సింది గుడ్ గవర్నెన్స్ పై కాదు.. స్మార్ట్ గవర్నెన్స్ పైన అన్నారు. పరిపాలన సౌలభ్యం, అధికారుల మధ్య సమన్వయం ఉండేలా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి పరిధిని ఒకే విధానం తీసుకొచ్చాం అని, హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా మూడు కార్పొరేషన్లుగా విభజించాం అని, నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేసుకున్నాం అని,
భవిష్యత్ అభివృద్ధి కోసం ఒక రోడ్ మ్యాప్ ను తయారు చేసుకున్నట్లుగా తెలిపారు.

కాలుష్య నివారణకే హిల్ట్ పాలసీ

నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తే… మధ్యతరగతికి భూమి అందుబాటులోకి వస్తుందని, నగరం నివాస యోగ్యంగామారుతుందని అందుకే హిల్ట్ పాలసీ ద్వారా కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు తరలిస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ లాంటి నగరంలా హైదరాబాద్ మారవద్దనే హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం అన్నారు. ఇండస్ట్రియల్ జోన్ కు మల్టీ జోన్ గా భూమిని బదలాయిస్తున్నాం తప్పా.. మేం యాజమాన్య హక్కులు ఎవరికీ అందించడం లేదు అని స్పష్టం చేశారు.

త్వరలో మెట్రో విస్తరణ పనులు

మెట్రో పై ఎల్ అండ్ టీ తో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించిందని, మెట్రోలో లాస్ట్ మైల్ కనెక్టివీటీ లేదు.. అందుకే మెట్రోను విస్తరిస్తున్నాం అని, మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిచింది అని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే మెట్రో విస్తరణ చేపట్టబోతున్నాం అన్నారు. నగరంలో సిగ్నల్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించి ప్రయాణం సాఫీగా సాగేలా చేయాలనేది మా ప్రయత్నం అని చెప్పుకొచ్చారు. కొంత కఠినం అనిపించినా ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాం అని, ఫుట్ పాత్ లో ఉండే చిరు వ్యాపారుల కోసం ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సహిస్తాం అని, కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశాం అని, సంస్కరణల్లో భాగంగా మేం ఇలాంటి చర్యలను చేపడుతున్నాం అన్నారు.

ఇవి కూడా చదవండి :

Sharwanand | రోహిత్–కోహ్లీ బయోపిక్‌లపై శర్వానంద్ క్లారిటీ.. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌క చేస్తానంటూ కామెంట్
TDR | టీడీఆర్‌ను పూర్తిగా ర‌ద్దు చేయండి.. గ్రేటర్ హైదరాబాద్ రియల్టర్ల డిమాండ్

Latest News