మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత!

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పీడీఎస్‌యూ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ విద్యార్థుల నిరసన.

హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్ ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్ యూ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. పీడీఎస్ యూ నిరసన దర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట సాగింది.

భారీగా పేరుకుపోయిన బకాయిలు

రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ, డిగ్రీ, పీజీ ఇతరత్రా ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు సుమారుగా 12 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.2500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కొన్నేళ్లుగా ఈ బకాయిలు చెల్లించక పోవడంతో సుమారుగా రూ.8 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి.

ప్రతి నెల రూ. 200కోట్ల విడుదలకు ప్రభుత్వ నిర్ణయం

విద్యార్ధుల ఫీజుల బకాయిలతో విద్యార్థులతో విద్యాసంస్ధల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి నెలా రూ.200 కోట్ల విడుదల చేయాలని నిర్ణయించింది. నిధుల కొరత కారణంగా ఏటా ఫీజులు పెండింగ్‌లో పడిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం తాజాగా స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే వేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికారికంగా ప్రకటించనుంది.

అయితే గతంలో విద్యార్ధుల అకౌంట్లకు నేరుగా ఫీజుల చెల్లింపు విధానానికి సంబంధించి ప్రభుత్వ జీవోలోని 12వ నిబంధనకు వ్యతిరేకంగా విద్యాసంస్థల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్ పై ఈనెల 24న హైకోర్టు విచారణ కీలకం కానుండం గమనార్హం.

Latest News