తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే “తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికసిత భారత్ 2047 లక్ష్యం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గా భారత్ ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా జాతీయ జీడీపీలో తెలంగాణ తన వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలనే ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీ విధానాన్ని రూపొందించుకున్నాం .. పరిశ్రమలు, పర్యాటకం, ఎనర్జీ, ఆరోగ్యం, స్పోర్ట్స్ లాంటి రంగాల్లో నిర్దిష్టమైన పాలసీలు రూపొందించుకున్నాం అని పునరుద్ఘాటించారు. ప్రపంచ స్థాయి కంపెనీలు, సరఫరా గొలుసులు, అనుబంధ పరిశ్రమలను ఆకర్షించి తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ రైజింగ్ పాలసీ తీర్చిదిద్దుతుందని చెప్పారు.
బుధవారం ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థానన చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాల్లో డేటా సెంటర్‌ను అమెజాన్ నిర్మించనుందని, 12 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ డేటా సెంటర్ కోసం అమెజాన్ రూ.60వేల కోట్లు వెచ్చించనుందని, చందనవెల్లిలో మరో 98 ఎకరాలను అమెజాన్‌కు రాష్ర్టప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్‌గా దీన్ని ఏర్పాటుచేయనున్నారని, ఇది హైదరాబాద్‌లో అమెజాన్ రెండో క్లౌడ్ రీజియన్‌గా ఏర్పాటుకానుందని తెలిపారు.2034 నాటికి అమెజాన్ సంస్థ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని కోరారు.అమెజాన్ డేటా సెంటర్‌ను కీలక మైలురాయి ప్రాజెక్టుగా అభివర్ణించిన సీఎం.. భారత్ ఫ్యూచర్ సిటీకి ఇది ప్రధాన బలంగా మారనుందని తెలిపారు.
అత్యాధునిక నగరంగా ఫ్యూచర్ సిటీ
అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగ కల్పన కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. అమెజాన్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఆ ప్రాంతాల్లో ఇతర కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు దోహద పడుతుందని, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కీలకం.. ఇందులో భాగంగా, పరిశ్రమల కల్పనకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు, అనుమతులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు. ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మించాలని, ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి 2025 డిసెంబర్ లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించాం .. 108 దేశాల నుంచి మూడు వేల మంది వివిధ దిగ్గజ కంపెనీల నుంచి కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రతి నెలా పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర రివ్యూ నిర్వహిస్తున్నాం .. అమెజాన్ సంస్థ పెట్టుబడులకు సంబంధించి ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం అని తెలిపారు.
కాలుష్య రహిత నగరంగా రాజధాని
హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రేవంత్ పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారు.. ఉద్యోగ అవకాశాలు కల్పించడం తోపాటు కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించే అవసరం ఉంది, మూసి నది ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరించడం అవసరం ఉందని, మూడు లక్షల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులు గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని.. నగరంలో డీజిల్ మీద ఆధార పడి నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ కు టాక్స్ ను పూర్తిగా మినహాయించి హైదరాబాద్ ను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది .. ఏడాదికి రూ 1,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అన్నారు. దేశంలో ఇతర నగరాల్లో ఉన్న కాలుష్య సంబంధిత సమస్యలను హైదరాబాద్ లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
మూడు ప్రాంతాలుగా రాష్ట్ర అభివృద్ది
క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించాం.. సమగ్ర ప్రణాళిక తో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల కోస భూములను త్యాగం చేసిన రైతులను ఎప్పటికీ మా ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుందని, భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చి సహకరించిన వారిని అభినందిస్తూ .. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ అవసరమైన నష్ట పరిహారాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలిస్తున్నానని తెలిపారు.
భూమి ఇచ్చి అభివృద్ధికి సహకరించిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆందోళనలు చేపడుతున్న రైతులతో చర్చించాలని మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మా రెడ్డికు సూచిస్తున్నానని.. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించాలి.. మంచి నష్ట పరిహారాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు,జూపల్లి కృష్ణా రావు,వాకిటి శ్రీహరి,అమర రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్,ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాస్ రెడ్డి,ఉమ్మడి జిల్లా ఎంఎల్ ఏ లు ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు.
