- కుటుంబంతో సహా ఇటీవలే ఢిల్లీ పెద్దతో భేటీ
- ఆ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ప్రజా ప్రతినిధులు
- బీజేపీ అవకాశమిస్తే ఐదుగురికి పదవులు
- సిట్టింగ్ ఎంపీ పరిస్థితి ఏమిటో మరి…
విధాత, హైదరాబాద్:
సాధారణంగా రాజకీయాలలో పార్టీ అగ్ర నాయకులు ఆశావహులకు ఆఫర్లు ఇస్తుంటారు. కానీ తెలంగాణకు చెందిన.. వందల కోట్ల వ్యాపారాలు నిర్వహిస్తున్న ఒక మాజీ మంత్రి ఏకంగా ఢిల్లీ బీజేపీ పెద్దలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ కుటుంబంలో ఐదుగురికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే, ప్రతిగా పార్టీకి వెయ్యి కోట్లు సమర్పించుకుంటానని ఆఫర్ ఇచ్చినట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఈ ఆఫర్ విన్న బీజేపీ పెద్దలు నోరెళ్లబెట్టారని ఆ చర్చల సారాంశం. ఈ ఆఫర్‌ను అంగీకరిస్తారా? లేదా? అనేది వచ్చే ఎన్నికల నాటికి కానీ తెలియదు కానీ.. ఢిల్లీ పాత్రికేయ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. అది తెలంగాణ రాజకీయ వర్గాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాజకీయ ప్రవేశం
వివిధ వ్యాపారాల్లో ఉన్న ఆయన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పట్లో ఒక ప్రాంతీయ పార్టీ నుంచి టిక్కెట్ సాధించేందుకు నానా తంటాలు పడ్డారు. ఆ పార్టీ నుంచి బీఫామ్ పొందేందుకు 50 కోట్లు సమర్పించుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనేక పదవులు కూడా చేపట్టారు. మంత్రిగా సైతం పనిచేశారు. ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీతో తేడా కొట్టిన ఆ నాయకుడు.. ప్రస్తుతం పక్క పార్టీల్లో సీట్ల కోసం అన్వేషిస్తున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కుటుంబంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు
వాస్తవానికి ఆయన కుటుంబంలో ఇప్పటికే ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ.. ఆయన మనసంతా ఆ సంఖ్యను పెంచుకోవడంపై ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి తను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందో లేదోనని డౌట్‌తో ఉన్న ఆయన.. ఒక వేళ గెలిచే పరిస్థితి ఉన్నా.. తన కుటుంబానికి సీట్లు పెరిగే అవకాశం లేదన్న ఆలోచనతో ఉన్నారని ఢిల్లీ పాత్రికేయ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇదే సమయంలో మరో ప్రాంతీయ పార్టీలో ఏకంగా అధ్యక్ష పదవి కోసమే ప్రయత్నాలు చేశారని మరో కథనం వినిపిస్తున్నది. అక్కడ నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడంతో ఏకంగా జాతీయ పార్టీనే టార్గెట్ చేసుకున్నారని ఢిల్లీ పాత్రికేయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. ఈ మధ్యే ఢిల్లీ పెద్దలతో కూడా కుటుంబంతో సహా వెళ్లి కలిశారు. అయితే.. ఇందుకు ఎవరినీ మధ్యవర్తులుగా పెట్టుకోకుండా.. నేరుగా కాంటాక్ట్ అయ్యారన్న వార్తలు బయటకు పొక్కుతున్నాయి. ఈ సందర్భంగానే తన మనసులో మాట విన్నవించుకున్న సదరు మాజీ మంత్రి.. తమ కుటుంబం నుంచి ప్రస్తుతం ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టు.. మరో ముగ్గురికి కూడా రాబోయే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే.. ఎలక్టోరల్ బాండ్లు లేదా మరో రూపంలో పార్టీ ఫండ్‌గా వెయ్యి కోట్లు ఇస్తానని బంపరాఫర్ ఇచ్చారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకేసారి ఇంత ఆఫర్ ఇవ్వడంతో మౌనం మినహా ఎలాంటి స్పందన లేదని తెలుస్తున్నది. సాధారణంగా పార్టీ అధినేతలు తమ శ్రేణులకు ఆఫర్లు ఇస్తుంటారని, కానీ.. ఇక్కడ ఎదురు ఆఫర్ అందిందని అంటున్నారు.
కుటుంబంలో ఎవరెవరికంటే…
వ్యాపారాలు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ప్రస్తుతం యజమానితో పాటు ఆయన అల్లుడు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తన ప్రభ తగ్గిపోవడం ఆయనకు సుతరామూ ఇష్టం ఉండటం లేదని అంటున్నారు. పైపెచ్చు తన వ్యాపార సామ్రాజ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా చూసుకునే క్రమంలోనే తాజా ప్రయత్నాలని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ నుంచి సీట్లు దక్కించుకుంటే పదవులతో, అధికారం చెలయించవచ్చనేది ఆ నేత అభిప్రాయంగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అదనంగా వచ్చే మూడు సీట్లలో సొంత కుటుంబంలోనే పంపిణీ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక ఇంట్లో పెద్దావిడకు కూడా ఏదో ఒక కార్పొరేషన్ పదవి దక్కకపోతుందా? అని అనుచరవర్గాలు చర్చించుకుంటున్నాయి.
గెలుపు కోసం ఐదు సీట్లకు 500 కోట్ల చొప్పున!
పార్టీ ఫండ్ కోసమే వేయి కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారంటే.. ఇక ఎన్నికల్లో గెలుపుకోసం ఐదు సీట్లకు గాను ఒక్కో సీటుకు కనీసం ఐదు వందల కోట్ల వరకూ ఖర్చు పెట్టుకోగల సామర్థ్యం ఆయనకు ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత రెండు ఎన్నికల్లో కూడా డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి విజయం సాధించాడని, మున్ముందు కూడా ఇదే రీతిన వెదజల్లుతారని ఆయన మనుసు తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ ఎంపీ పని అంతేనా…
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీలో ఉన్నత స్థానం కోసం ప్రయత్నించిన ఆయనకు అధిష్ఠానం నుంచి నిరాశే ఎదురైంది. ఆయనకు పదవి రాకుండా ఇద్దరు ముగ్గురు సీనియర్లు అడ్డుపడ్డంతో తన భవిష్యత్తు ఏంటనే దానిపై ఆయన ఇప్పటికే కొంత అంతర్మథనం చెందుతున్నారు. ఆయనపై స్థానికేతర ముద్ర వేసే కుట్రలు పార్టీలో మొదలయ్యాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఇదే సావకాశంగా మాజీ మంత్రి వేయి కోట్ల ఆఫర్‌తో దిగారని చర్చించుకుంటున్నారు. తనకు కేటాయిస్తే గెలిపించుకు తీసుకువస్తానని, ప్రస్తుత ఎంపీ స్థానికేతరుడు అంటూ ప్రచారం మొదలుపెట్టారు.
సిటింగ్ ఎంపీని మార్చుతారా..
రాజకీయ పార్టీలు సాధారణంగా సిటింగ్ ఎంపీని మార్చేందుకు సుముఖంగా ఉండవు. ఎలాంటి వివాదాలు లేనప్పుడు, ప్రజాదరణ ఉన్న సమయంలో ఆయనకే మళ్లీ బీ ఫారం ఇచ్చేందుకే తొలి ఆలోచన చేస్తారు. ఇవన్నీ తెలిసి కూడా మాజీ మంత్రి పట్టు పదలని విక్రమార్కుడి మాదిరి ఢిల్లీలో లాబీయింగ్ మొదలు పెట్టారని ఢిల్లీ పాత్రికేయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పార్టీ రాష్ట్ర చీఫ్ లేదా బీజేపీ కేంద్ర మంత్రికి కూడా పాత్ర లేకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని అనుకుంటున్నాయి. మొత్తానికి ఈ ఆఫర్ నిజమే అయితే.. అది మునుపెన్నడూ ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వనిదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Apple Farming | కరువు నేలలో ఆపిల్ సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన మహారాష్ట్ర రైతు!
షుగర్ ఉన్న వాళ్లు అసలు తినకూడని పండ్లు ఇవే.. తిన్నారో ఇక మీ అంతే!
విశ్వగురు ! నిజాలు దాస్తున్నారా!..ఆర్థిక బుడగ పేలనుందా ?