Apple Farming | కరువు నేలలో ఆపిల్ సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన మహారాష్ట్ర రైతు!

Apple Farming | ఆపిల్ పండ్లు అంటే చల్లటి ప్రాంతాల్లోనే కాస్తాయని అంతా భావిస్తుంటారు. కానీ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన కాకాసాహెబ్ సావంత్ అనే రైతు కరువు నేలలో వేడి వాతావరణంలో కూడా ఆపిల్ పంట సాగు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Apple Farming | ఆపిల్ పండ్ల సాగు అంటే వెంటనే గుర్తొచ్చేది హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాలే. మంచు కురిసే కొండ ప్రాంతాల్లోనే ఆపిల్ చెట్లు పెరుగుతాయని గతంలో అంతా అనుకునేవారు. కానీ మహారాష్ట్రలోని కరువు నేలలో కూడా ఆపిల్ పంట సాగు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడో రైతు. సంగ్లీ జిల్లాలోని జాట్ తాలుకాకు చెందిన కాకాసాహెబ్ సావంత్ అనే రైతు వేడి వాతావరణంలో కూడా ఆపిల్ సాగు చేసి సక్సెస్ అయ్యాడు. తన కష్టానికి ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యాన్ పండిట్ అవార్డుతో సత్కరించింది కూడా!

కర్ణాటక సరిహద్దు ఆనుకుని ఉన్న జాట్ తాలుకాను కరువు నేలగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ దాటిపోతాయి. చలికాలంలో కూడా ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. ఇక్కడ సంవత్సరానికి సగటు 560 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇక్కడ సాధారణ పంటలు సాగవ్వడమే చాలా కష్టం. కానీ ఆ ప్రాంతంలో శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఆపిల్ పంటను సాగు చేసి కాకాసాహెబ్ సావంత్ అద్భుతం సృష్టించాడు.

కాకాసాహెబ్ ఒకప్పుడు ఆటోమొబైల్ మెకానిక్‌గా పనిచేశాడు. కానీ వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో 2010లో పని మానేసి రైతుగా స్థిరపడ్డాడు. పండ్ల మొక్కలు, అటవీ మొక్కల నర్సరీని ప్రారంభించాడు. కొత్త కొత్త పంటలపై ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. అలా 2018-19లో ఆయన చేసిన వినూత్న ప్రయోగాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఉద్యాన్ పండిట్’ అవార్డుతో కూడా సత్కరించింది. ఈ క్రమంలోనే హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన రైతు హరిమాన్ శర్మ అభివృద్ధి చేసిన HRMN 99 అనే ప్రత్యేక ఆపిల్ రకం గురించి తెలుసుకున్నాడు.

ఈ రకం వేడి వాతావరణంలో కూడా పెరుగుతుందని తెలిసి 2020లో హరిమాన్ శర్మను కాకాసాహెబ్ సావంత్ సంప్రదించాడు. అతనితో అన్ని విషయాలు చర్చించి 150 మొక్కలను కొని తీసుకొచ్చాడు. వాటిని ప్రయోగాత్మకంగా ఒక ఎకరంలో నాటాడు. ఆ సమయంలో సావంత్ చేస్తున్న పనిచేసి గ్రామస్తులు, ఇతర రైతులు నవ్వుకున్నారు. సాధారణ పంటలే ఇక్కడ పండవు.. ఆపిల్స్ కాస్తాయా అని అంతా ఎగతాళి చేశారు. కానీ అవేవి పట్టించుకోకుండా సావంత్ తన పనిమీద మాత్రమే దృష్టిపెట్టాడు.

అయితే, సావంత్ తీసుకొచ్చి నాటిన 150 మొక్కల్లో 25 మొక్కలు ఎండల వల్ల కొద్ది రోజులకే చనిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సావంత్ వెంటనే సంరక్షణ చర్యలు తీసుకున్నాడు. దీంతో 125 మొక్కలు బతికాయి. వాటిని కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. తన ప్రాంతంలో నీటి కొరత ఉంది కాబట్టి, మొక్కలకు నీరు, ఎరువుల్ని బిందు సేద్యం ద్వారా అందించాడు. అలాగే పశువుల పేడను కూడా ఎరువులా వాడాడు. అలా మొక్కలు నాటి రెండేళ్లకు అవి చెట్లుగా మారాయి. ఇప్పుడు ప్రతి మొక్కకు 30 నుంచి 40 ఆపిల్స్ కాస్తున్నాయి. ఒక్కో కాయ 100 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది.

సావంత్ పొలంలో కాస్తున్న ఆపిల్ పండ్లకు హిమాచల్ ప్రదేశ్‌లో దొరికే పండ్లకు పెద్ద తేడా లేదు. పండు రంగు, రుచి, వాసన ఒకేలా ఉన్నాయి. దీంతో మార్కెట్‌లో మంచి రేటు లభిస్తుంది. ఇది చూసిన ఇతర రైతులు కూడా ఇప్పుడు సావంత్ అడుగుజాడల్లోనే ఆపిల్ పండ్ల సాగుకు సుముఖత చూపుతుండటం విశేషం.

సావంత్ సాగు చేస్తున్న HRMN 99 ఎలా రూపుదిద్దుకుంది?

HRMN 99 ప్రత్యేక ఆపిల్ రకాన్ని హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన రైతు హరిమాన్ శర్మ అభివృద్ధి చేశారు. 1999లో తన ఇంటి ఆవరణలో ఒక ఆపిల్ మొక్క మొలకెత్తడం ఆయన గమనించాడు. సాధారణంగా ఆ ప్రాంతం సంప్రదాయ ఆపిల్ సాగుకు అనుకూలం కాదు. అయినప్పటికీ మొక్క మొలకెత్తడంతో దాన్ని జాగ్రత్తగా పెంచాడు. కొన్నేళ్లకు అతి పండ్లు కాయడం మొదలైంది. అయితే పండ్ల పరిమాణం చిన్నగా ఉండటంతో దానిపై ప్రయోగాలు చేశాడు. ఆపిల్ చెట్ల కొమ్మలను ప్లమ్ చెట్లతో గ్రాఫ్టింగ్ చేసి మెరుగైన రకాన్ని అభివృద్ధి చేశాడు. దీంతో పెద్ద పరిమాణంలో, నాణ్యమైన పండ్లు కాయడం మొదలయ్యాయి. తర్వాత అదే రకాన్ని మరింత అభివృద్ధి చేసి HRMN 99 వంగడంగా పేరు పెట్టారు. ఈ రకం సామర్థ్యాన్ని పరిశీలించేందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF) దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయించింది. 2015-17 మధ్య సుమారు 10 వేల మొక్కలను నాటించింది. అనేక రాష్ట్రాల్లో ఇది సక్సెస్ అయ్యింది. దీంతో హరిమాన్ శర్మ ఆవిష్కరణకు ప్లాంట్ బ్రీడర్స్ రైట్స్ కూడా లభించాయి.

Read More:

ఇంటి మేడపైనే కూరగాయల సాగు.. నెలకు 5వేలు ఆదా చేస్తున్న కేరళ గృహిణి

Terrace Garden | మట్టి లేకుండానే టెర్రస్‌పై గార్డెనింగ్.. సమ్మర్‌లో ఏసీ అవసరం లేకుండా చేసిన 70 ఏళ్ల వృద్ధుడి ఆలోచన!

Latest News