వైరల్.. నాన్న మాట విని నవ్విన గర్బస్థ శిశువు!

అల్ట్రాసౌండ్ స్కానింగ్ సమయంలో తండ్రి గొంతు వినగానే గర్భంలోని ఆడ శిశువు చిరునవ్వు చిందించినట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మధుర క్షణం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.

మహాభారతంలో భగవాన్ శ్రీకృష్ణుడు పద్మప్యూహం గూర్చి అర్జునుడికి వివరిస్తున్న క్రమంలో అక్కడే ఉన్న సుభద్ర కడుపులోని అభిమన్యుడు ఆ మాటలను విని గ్రహించినట్లుగా పురాణ కథనం. సరిగ్గా అదే తరహాలో గర్భస్థ శిశువు తన తండ్రి మాట విని సమాధానంగా చిరునవ్వుతో బదులివ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సమయంలో కనిపించింది. పుట్టకముందే నాన్నతో ఏర్పడిన ఆ మధురమైన అనుబంధాన్ని చూపించిన ఈ హృద్యమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్ట్రాసౌండ్ స్కానింగ్ సమయంలో తండ్రి గొంతు వినగానే గర్భంలో ఉన్న ఆడ శిశువు చిరునవ్వు చిందించింది. గర్భంలోని తన కూతురిని పలకరిస్తూ తండ్రి మాట్లాడుతూ తల్లి పొట్టపై ముద్దుపెట్టుకుంటుండగా..తండ్రి గొంతు వినగానే కడుపులోని ఆడబిడ్డ నవ్వినట్లు కనిపించింది. ఆ మధుర క్షణం వీడియోలో రికార్డ్ అయింది. దీంతో గదిలో ఉన్న ప్రతిఒక్కరూ నవ్వులు చిందించారు.

ఈ ఘటనపై తల్లి లియా ఒలివెరా స్పందిస్తూ..తన కడుపులోని బిడ్డ తండ్రి గొంతు విని స్పందించడం చూసి నేను భావోద్వేగంతో పూర్తిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాననని, ఆ వెంటనే ఆనంద భాష్పాలు రాల్చాను అని తెలిపింది. ఇదంతా తమ కుటుంబానికి ఒక “ముఖ్యమైన జ్ఞాపకం” అని అభివర్ణించింది. ఈ వీడియోతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి “కొద్దిపాటి సంతోషాన్ని” పంచినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.

Latest News