Donald Trump | ట్రంప్ నోబెల్ కల చెదిరింది..వైట్ హౌస్ ఫైర్
నోబెల్ శాంతి బహుమతి-2025 వెనిజులా ఎంపీ మరియా కొరీనా మచోడాకు దక్కడంతో డోనాల్డ్ ట్రంప్ కల చెదిరింది. నోబెల్ కమిటీ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ట్రంప్ కార్యవర్గం ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేసింది.

విధాత : నోబెల్ శాంతి బహుమతి కోసం కలలుగన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలలు చెదిరిపోయాయి. నోబెల్ శాంతి బహుమతిని నోబెల్ కమిటీ వెనిజులా విపక్ష నేత, ఎంపీ మరియా కొరీనా మచోడాకు ప్రకటించడంతో ట్రంప్ నోబెల్ ఆశలు ఆవిరైపోయాయి. తాను ఇప్పటికే ప్రపంచంలో 7యుద్దాలు ఆపానని..తాజాగా హమాస్ – ఇజ్రాయిల్ యుద్దంతో 8వ యుద్దం కూడా ఆపి శాంతి స్థాపనకు కృషి చేశానని..తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని ట్రంప్ కొన్ని రోజులుగా ప్రచారం చేసుకుంటూ దానిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ రష్యా, ఇజ్రాయెల్, పాక్ సహా పలు దేశాలతో నామినేట్ సైతం చేయించుకున్నారు. నోబెల్ ప్రకటనకు ముందు స్పందిస్తూ.. ఆ అవార్డు నాకు రాకపోతే అమెరికాకు అవమానం అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం కోసం ఏమీ చేయకపోయినా ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారని, ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ అక్కసు వెళ్లగక్కారు. తాను ఎన్ని మంచి పనులు చేసినా.. నోబెల్ మాత్రం ఇవ్వరంటూ ఓ సందర్భంలో ఆవేదన చెందారు. ఇంత చేసినప్పటికి నోబెల్ కమిటీ మాత్రం ట్రంప్ ను పట్టించుకోలేదు. ట్రంప్ ఆశలను అడియాశలు చేస్తూ.. మరియా కొరీనా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించింది. ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ వచ్చిన నామినేషన్లు అన్నీ నిర్ధేశిత గడువు జనవరి 31 తర్వాతే రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2026నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్ ఖచ్చితంగా ఉంటారని..శాంతి బహుమతి కోసం ఆయన యుద్ధం ఇప్పుడే మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోబెల్ దక్కకపోవడంపై ట్రంప్ కార్యవర్గం అసంతృప్తి
ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం పట్ల ట్రంప్ కార్యవర్గం ఎక్స్ వేదికగా తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కింది. ప్రపంచశాంతికి నిజమైన నిబద్ధత చూపిన వారిని నోబెల్ కమిటీ పక్కన పెట్టిందని..శాంతి స్థాపన కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చిందంటూ వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చుయెంగ్ ఎక్స్ లో ఆక్షేపించారు. యుద్దాలను ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడుతారు. ఆయన మానవతావాది. తన సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించే ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండరు అని చుయెంగ్ తన పోస్టులో పేర్కొన్నారు.
నోబెల్ కమిటీ వివరణ
యుద్దాలు ఆపినా…పలు దేశాల నుంచి మద్దతు వచ్చినా..ట్రంప్ కు నోబెల్ రాకపోవడంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జొర్గెన్ వాట్నె ఫ్రిడ్నెస్ స్పందించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా విజేతలను ఎంచుకుంటామని స్పష్టం చేశారు. నోబెల్ కమిటీ మీడియా, బహిరంగ ప్రచారాలను నిరంతరం గమనిస్తుంటుందని.. నోబెల్ గ్రహీతల చిత్రాలు ఉన్న గదిలో కూర్చుని ఆ లేఖలను మేం చూస్తాం అని తెలిపారు. ఆ గది మాకు ధైర్యాన్నిస్తుందని.. సమగ్రతతో పనిచేసే సంకల్పాన్ని కలిగిస్తుందని.. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా మేం నిర్ణయాలు తీసుకుంటాం’’ అని వివరించారు.
అటు శాంతి స్థాపనలో త్వరితగతిన దక్కిన దౌత్య విజయాలకంటే.. స్థిరమైన, బహుపాక్షిక ప్రయత్నాలకు నోబెల్ కమిటీ ప్రాధాన్యం ఇస్తుందని చరిత్రకారుడుగా థియో జెనౌ అభిప్రాయపడ్డారు. పలు యుద్దాలను ఆపి ట్రంప్ చేసిన శాంతి ప్రయత్నాలు సుస్థిర ఫలితాలు ఇస్తాయని ఇంకా నిరూపితం కాలేదని..ఒక ఘర్షణను స్వల్పకాలంపాటు ఆపడానికి.. దాని మూలకారణాలు గుర్తించి, పరిష్కరించడానికి మధ్య చాలా తేడా ఉంటుందని వివరించారు. అయితే ట్రంప్ వచ్చే నోబెల్ రేసులో ప్రధాన పోటీదారుగా ఉంటారన్నారు.