Greenland Animals AI Video | ట్రంప్‌పై పోరాటానికి తుపాకులు పట్టిన ధృవపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు స్లెడ్జ్‌ కుక్కలు!! ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వీడియో

అక్కడ ధృవపు ఎలుగుబంట్లు తమ గడ్డను రక్షించుకునేందుకు యుద్ధంలోకి దిగుతున్నాయి. చనిపోయిన జంతువుల ఆత్మలు సైతం తాము సైతం పోరుకు సిద్ధమంటున్నాయి. డాల్ఫిన్లు, స్లెడ్జ్‌ డాగ్స్‌.. ఒకటేమిటి.. అన్నీ తమ గడ్డపై దురాక్రమణను సహించేది లేదంటూ ట్రంప్‌ సర్కార్‌కు హెచ్చరికలు పంపుతున్నాయి.

Greenland Animals AI Video | ట్రంప్‌పై పోరాటానికి తుపాకులు పట్టిన ధృవపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు స్లెడ్జ్‌ కుక్కలు!! ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వీడియో

Greenland Animals AI Video | ధృవపు ఎలుగుబంటి యుద్ధానికి సిద్ధం అంటూ తుపాకి పడితే ఎలా ఉంటుంది? దురాక్రమణకు వ్యతిరేకంగా మేము సైతం అంటూ వాల్రూస్‌లు, ధృవపు తిమింగలాలు, డాల్ఫిన్లు, పెంగ్విన్లు బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? బరిలోకి దిగడమే కాదు.. ఆయుధాలు చేబూని.. విప్లవ గీతాలు ఆలపిస్తే ఎలా ఉంటుంది? జంతువులేంటి.. ఆయుధాలు చేపట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. ముందుగా ఈ కథనం చదవాల్సిందే.. ఆ తదుపరి వీడియో చూడాల్సిందే.

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ అనేక మంది రకరకాల మీమ్స్‌తో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఒకానొక వీడియో ఇది. కానీ.. అత్యంత భిన్నమైన కోణంలో, మాతృభూమి రక్షణ కోసం జంతువులు సైతం ఆక్రోశిస్తున్నాయని చెబుతూ కృత్రిమ మేధను ఉపయోగించి ఈ వీడియో తయారు చేశారు. చూడటానికి ఈ వీడియో సరదాగా అనిపిస్తున్నా.. అమెరికా అధ్యక్షుడి నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించుకొనే క్రమంలో ఆ దేశ ప్రజల అత్మగౌరవాన్ని, పోరాట స్ఫూర్తిని హృదయానికి హత్తుకునేలా ఉంది. అందుకే నెట్టింట నెటిజన్ల మద్దతు పొందుతున్నది.

గ్రీన్‌లాండ్‌ అనేది డెన్మార్క్‌కు చెందిన, పాక్షికంగా స్వయంప్రతిపత్తి కలిగిన మంచు ద్వీపం. అపార ఖనిజ నిక్షేపాలు, చమురు సంపద కలిగిన ప్రాంతం. దీన్ని అమెరికాలో కలుపుకోవాలని ట్రంప్‌ ఉబలాటపడుతున్నారు. నిజానికి చైనా, ఇతర దేశాల నుంచి భద్రతా సమస్యలను ట్రంప్‌ ముందుకు తెస్తున్నా.. అంతిమంగా అక్కడి ఖనిజ నిక్షేపాలపైనే ట్రంప్‌ కన్నుపడిందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో అమెరికాను ఎదుర్కొనేందుకు సైతం గ్రీన్‌ల్యాండ్‌ సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే కృత్రిమ మేధతో రూపొందించిన ఈ వీడియో వైరల్‌ అవుతున్నది. గ్రీన్‌లాండ్‌ ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ఎవ్వరూ జయించలేరు.. అనే కాన్సెప్ట్‌తో ఈ వీడియోకు పాటను జోడించారు.

ఇది నిరసన పాట. సినిమాటిక్‌ విలువలు, ఉద్రేకపర్చే సంగీతంతో ట్రంప్‌పై పోరాటానికి పిలుపునిచ్చే పాట. ఇందులో కొంత వ్యంగ్యతను జోడించి.. గ్రీన్‌లాండ్‌ రక్షణ కోసం జరిగే పోరాటంలో మనుషులతో అక్కడి జంతువులు సైతం చేయి కలుపుతున్నట్టు రూపొందించారు. అంతేకాదు.. చనిపోయిన జంతువుల ఆత్మలు సైతం ఈ పోరాటంలో కలిసి వస్తాయి. ఆకలితో ఉన్న రాక్షసుడు అంటూ ట్రంప్‌ను ఈ పాటలో అభివర్ణించారు. గ్రీన్‌ల్యాండ్‌ జెండా సగర్వంగా రెపరెపలాడుతుంది.. ఇన్యుఎట్‌ సంప్రదాయ యోధుల్లా మనుషులతోపాటు, జంతువులు కూడా నిలబడుతాయి. ధృవ ఎలుగుబంట్ల చేతిలో హార్పూన్లు, తుపాకులు ఉంటాయి. వాల్రస్‌లు మిలిటరీ వాహనాలు నడుపుతుంటాయి. కుక్కలు, సీల్స్‌, పెంగ్విన్స్‌ వంటివి సైతం యుద్ధానికి సై అంటాయి.

ఆ పాటలో కొన్ని వాక్యాలను గమనిస్తే.. ‘కలాలిట్‌ (గ్రీన్‌లాండ్‌ ఆదివాసీలు) శాశ్వతంగా నిద్రపోయవాళ్లు కాదు.. ఒక ఆకలితో ఉన్న రాక్షసుడు మా తీరాన్ని దురాక్రమించాలని చూస్తున్నాడు… ఇక్కడి చమురు తాగాలని, ఖనిజ సంపదను మింగేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆ గోలియత్‌ లోతుల్లోకి దిగాడు… ప్రతి ఆత్మను నిద్రలేపుతున్నాడు.. అంటూ సాగిపోతుంది. ఒక చోట ట్రప్‌ శరీర ఛాయను ప్రస్తావిస్తూ.. ‘ఆరెంజ్‌ చేతివేళ్లు ముందుకు వస్తాయి.. కానీ.. అవి మంచులో గడ్డకట్టి.. కూలిపోతాయి..’ అని ఉంటుంది.

మొత్తంగా ఈ వీడియో ఎపిక్‌ అని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఇది ఒక సాంస్కృతిక, డిజిటల్‌ నిరసనగా అభివర్ణిస్తున్నారు. ఒక ఆత్మగౌరవ గళం ఈ పాటలో వినిపిస్తున్నదని పేర్కొంటున్నారు.

Read Also |

Emmanuel Macron | ట్రంప్‌తో వివాదం వేళ.. దావోస్ సదస్సు వేదికపై సన్‌గ్లాసెస్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. నెట్టింట చర్చ
Sunita Williams | అంతరిక్ష ప్రయాణానికి గుడ్‌బై చెప్పిన సునీతా విలియమ్స్‌.. ఆమె ప్రయాణం ఓ అద్భుతం.. సాహసం!
Municipal Elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 24 లేదా 27న ?