నల్లులు ఉన్నాయని వెళితే.. అక్రమ మానవ రవాణా గుట్టు రట్టు ! పెద్ద రాకెట్‌ ఉంటుందని పోలీసుల అనుమానాలు

అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు వ్యక్తులను ప్రిన్స్‌టన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి, వాటిలో పనిచేసే పేరుతో భారత్‌ నుంచి యువతులను తెప్పించి, తమ షెల్‌ కంపెనీల్లో బలవంతంగా పనిచేయిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది

నల్లులు ఉన్నాయని వెళితే.. అక్రమ మానవ రవాణా గుట్టు రట్టు ! పెద్ద రాకెట్‌ ఉంటుందని పోలీసుల అనుమానాలు

ప్రిన్స్‌టన్‌: అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు వ్యక్తులను ప్రిన్స్‌టన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి, వాటిలో పనిచేసే పేరుతో భారత్‌ నుంచి యువతులను తెప్పించి, తమ షెల్‌ కంపెనీల్లో బలవంతంగా పనిచేయిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన చందన్‌ దాసిరెడ్డి (24), సంతోష్‌ కట్కూరి (31), ద్వారక గుండా (31), అనిల్‌ మాలె (37)ను అరెస్టు చేశారు.

ఈ కేసులో దర్యాప్తు ఈ ఏడాది మార్చిలో మొదలైంది. సంతోష్‌ కట్కూరి, ఆయన భార్య ద్వారక గుండాకు చెందిన షెల్‌ కంపెనీల్లో 15 మంది యువతులను బలవంతంగా పనిచేయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. కొల్లిన్‌ కౌంటీలోని గిన్స్‌బర్గ్‌ లేన్‌ 1000 బ్లాక్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో అనేక మంది యువతులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. సెర్చ్‌వారెంట్‌పై వచ్చిన పోలీసులు సంతోష్‌ కట్కూరి ఇంటిని తనిఖీ చేయగా.. దాదాపు 15 మంది యువతులు దుర్భర స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. తమతో షెల్‌ కంపెనీలకు బలవంతంగా పనిచేయించుకుంటున్నట్టు ఆ యువతులు పోలీసులు తెలిపారు. దయనీయమైన స్థితిలో జీవిస్తున్న ఆ యువతులు.. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలతో నిండి ఉన్న గదిలో నేలపైనే పడుకుంటున్నారు. బాధితుల్లో పలువురు యువకులు కూడా ఉన్నారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. వీరంతా షెల్‌ కంపెనీలకు ప్రోగ్రామర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. తనిఖీల సందర్భంగా పోలీసులు పలు ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, ప్రింటర్లు, కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి ద్వారా ప్రిన్స్‌టన్‌, మెలిస్సా, మెక్‌కిన్నేలలో కూడా బలవంతంగా పనులు చేయిస్తున్న విషయాలు వెలుగు చూశాయి. ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

నల్లుల సమస్య పరిష్కారానికి పెస్ట్‌ కంపెనీ ప్రతినిధిని పిలువడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పెస్ట్‌ కంపెనీ ప్రతినిధి అక్కడ నేలపైనే సూట్‌కేసుల మధ్య అనేక మంది యువతులు నిద్రపోవడం గమనించి, అనుమానంతో పోలీసులను ఆశ్రయించినట్టు అఫిడవిట్‌లో తెలిపారు.

ఈ అక్రమ మానవ రవాణా బాగోతంలో ఇంకా అనేక మంది హస్తం ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రిన్స్‌టన్‌ పోలీస్‌ సార్జెంట్‌ కరోలిన్‌ క్రాఫోర్డ్‌ చెప్పారు. దాదాపు వంద మందికిపైగానే ఇందులో భాగస్వాములుగా ఉండొచ్చొని అన్నారు. ఇందులో సగం మంది బాధితులేనని తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. సీజ్‌ చేసిన పరికరాలు, డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు వీరిని బలవంతంగా తీసుకొచ్చి పనిచేయిస్తున్నట్టు ధృవీకరించుకుని సోమవారం ఆ నలుగురిపై అరెస్టు వారెంటు జారీ చేసి, కస్టడీలోకి తీసుకున్నారు.