గాజాపై భారీ పోరుకు రంగం సిద్ధం.. సామాన్యుల కోసం కొన్ని గంటల కాల్పుల విరమణ

- ఇజ్రాయెల్ దాడిలో 600 మంది బాలలు సహా 1900 మంది గాజా వాసులు మృతి
- హమాస్ అంతం చేసి తీరుతామని నెతన్యాహు ఉద్ఘాటన
విధాత: తాము హమాస్‌ను తుడిచిపెట్టేయనున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. వారిని ఓడించి తీరతామని, దానికి కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే. వారు ఇప్పటికే తమ మూల్యం చెల్లించుకోవడం మొదలుపెట్టారు. వాటి వివరాల్లోకి వెళ్లదలుచుకోవడం లేదు అని ఆయన అన్నారు. యుద్ధం ఏడో రోజుకు చేరగా ప్రస్తుతం ఇజ్రాయెల్ దళాలదే పైచేయిగా ఉంది.
హమాస్ సీనియర్ మిలటరీ కమాండర్, ఏరియల్ ఆపరేషన్స్ వ్యూహకర్త మురాద్ అబు మురాద్‌ను మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించింది. గాజాలో అతడు ఉంటున్న భవంతిని పూర్తిగా నేలమట్టం చేశామని పేర్కొంది. గాజా ప్రాంతంలోకి ఆహారం, కరెంటు సరఫరా కాకుండా చేసిన సైన్యం.. ఉపరితల యుద్ధానికి సిద్దపడుతోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే ఉత్తర గాజా నుంచి దక్షిణ ప్రాంతానికి తరలిపోవాలని గాజా పౌరులకు ఇజ్రాయెల్ సూచించింది.
సుమారు 10 లక్షల మంది వెళ్లడానికి వీలుగా సురక్షిత కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి దాడులు చేపట్టమని ఆ లోపు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని ట్వీట్‌లో సూచించింది. మరోవైపు అక్కడి సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఇప్పటి వరకు సుమారు 1900 మంది మరణించగా అందులో 600 మంది చిన్నారులే కావడం గమనార్హం. హెచ్చరికలు లేకుండా బాంబులు జార విడుస్తుండటంతో ప్రజలు క్షతగాత్రులుగా మారుతున్నారు. చాలా మంది ప్రధాన ఆస్పత్రుల వద్దే గుమిడగూడి ఉంటున్నారు. ఏ క్షణమైనా తమపై దాడి జరుగుతందని, అందుకే చికిత్స కోసం ఆస్పత్రుల సమీపంలో ఉంటున్నామని స్థానికులు తెలిపారు. బందీలుగా ఉన్న ఇజ్రాయేలీయులను విడిచి పెడితేనే గాజాకు అన్ని రకాల సరఫరాలను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు హమాస్ ఉగ్రవాదులు రూపొందించినట్లు చెబుతున్న రహస్య డాక్యుమెంట్లు బయటపడ్డాయి. గాజా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలు, యూత్ సెంటర్లపై దాడి చేయాలని వారు ప్రణాళిక వేసుకున్నట్లు అందులో ఉంది. అంతే కాకుండా విచ్చల విడిగా కాల్పులు జరిపి సాధ్యమైనంత ఎక్కువ మంది చంపాలని రాసుకున్నారు.
ఇందుకోసం రెండు యూనిట్ల ఉగ్రవాదులకు తీవ్ర శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమపై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా హమాస్ ఒక వీడియోను విడుదల చేసింది. తమ అధీనంలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులకు, పిల్లలకు ఆహారం పెడుతున్నట్లు అందులో ఉంది. గాజా ఉత్తరంలో ఉన్న సామాన్యులు దక్షిణ దిశకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. దాడులను తీవ్ర తరం చేయనున్నామని హెచ్చరించింది.