Hezbollah । ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతం
ఈ దాడిలో హిజ్బొల్లా సదరన్ ఫ్రంట్ కమాండర్ అలి కర్కి, హిజ్బొల్లా అదనపు కమాండర్లు కూడా చనిపోయినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొన్నది. శుక్రవారం దాడిలో ఆరుగురు చనిపోయారని, 91 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే.. నస్రల్లా మరణంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Hezbollah । బీరుట్‌పై శుక్రవారం జరిపిన దాడిలో హిజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ శనివారం ప్రకటింది. దక్షిణ బీరుట్‌లోని దహియా కేంద్ర కార్యాలయంలో హిజ్బొల్లా నాయకత్వం సమావేశమైన సమయంలో ఈ దాడి నిర్వహించినట్టు తెలిపింది. ఈ వైమానిక దాడిలో ఆరు అపార్ట్‌మెంట్ భవనాలు నేలమట్టమైనట్టు పేర్కొన్నది. దాదాపు మూడు దశాబ్దాలుగా హిజ్బొల్లాకు నస్రల్లా నాయకత్వం వహిస్తున్నాడు. 1990వ దశకం ప్రారంభంలో పగ్గాలు చేపట్టిన సస్రల్లా.. అప్పటి వరకూ స్థానిక మిలీషియా గ్రూపుగా ఉన్న హిజ్బొల్లాను బలమైన ప్రాంతీయ శక్తిగా తయారు చేశాడు. ఇరాన్ రాజకీయ, మిలిటరీ లక్ష్యాలకు అనుబంధంగా నడిపించాడు. మధ్య ఆసియాలో ఇరాన్‌కు శక్తిమంతమైన సహచర సంస్థగా హిజ్బొల్లా తయారైంది.
పదులకొద్దీ రాకెట్లతో హిజ్బొల్లా దాడులు చేయడంతో తాము భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతున్నది. తొలుత నస్రల్లా మరణంపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఇరాన్ మీడియాలో ఈ విషయంపై పరస్పర విరుద్ధ వార్తలు వచ్చాయి. నస్రల్లా మరణ వార్తను ధృవీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఇరాన్ సీనియర్ సెక్యూరిటీ అధికారి ఒకరు మీడియా సంస్థలకు తెలిపారు. నస్రల్లా బతికే ఉన్నట్టు, దాడి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఎవరికీ అందుబాటులో లేనట్టు దాడి అనంతరం హిజ్బొల్లా విశ్వసనీయ వర్గాలు తమకు తెలిపాయని రాయిటర్స్ పేర్కొన్నది. కానీ.. చివరకు ఆయన చనిపోయినట్టు హిజ్బొల్లా ప్రకటించింది.
లెబనాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొన్నది. మూడు బెటాలియన్ల రిజర్వ్ సేనలను శనివారం ఉదయం రంగంలోకి దింపినట్టు తెలిపింది. అంతకు ముందే రెండు బ్రిగేడ్ల సైనికులను ఉత్తర ఇజ్రాయెల్‌కు పంపింది. లెబనాన్‌లో భూతల పోరుకు వారిని ఇజ్రాయెల్ ఆర్మీ సిద్ధం చేస్తున్నది. శనివారం ఉదయం కూడా ఇజ్రాయెల్ మిలిటరీ దక్షిణ బీరుట్, తూర్పు లెబనాన్‌లోని బేకా లోయపై పలు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ వారం రోజుల్లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 720 మంది చనిపోయారు. నేలమట్టమైన భవనాల కింద అనేక మంది చిక్కుకు పోయారన్న వార్తల నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.