Ismail Haniyeh Assassination : హమాస్‌ చీఫ్‌ హత్యకు 2 నెలల ముందే గెస్ట్‌హౌస్‌లో బాంబు?

హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా హత్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. టెహరాన్‌లోని గెస్ట్‌హౌస్‌లో బుధవారం మందుపాతర పేలుడులో ఆయన చనిపోయారు. అయితే.

Ismail Haniyeh Assassination : హమాస్‌ చీఫ్‌ హత్యకు 2 నెలల ముందే గెస్ట్‌హౌస్‌లో బాంబు?

టెహరాన్‌లో హనియా తరచూ బస చేసే గెస్ట్‌హౌస్‌
భద్రతాలోపాన్ని వాడుకుని బాంబు పెట్టిన ప్రత్యర్థులు
సంచలన విషయాన్ని బయటపెట్టిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక

న్యూయార్క్‌: హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా హత్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. టెహరాన్‌లోని గెస్ట్‌హౌస్‌లో బుధవారం మందుపాతర పేలుడులో ఆయన చనిపోయారు. అయితే.. ఆయన హత్య విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇరాన్‌ అధ్యక్షుడిగా మసౌద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు హనియా టెహరాన్‌కు వచ్చారు. ఉత్తర టెహరాన్‌లోని ఎగువ ప్రాంతంలో ఒక గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఆ గెస్ట్‌హౌస్‌కు కాపలాగా ఇస్లామిక్‌ రివొల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా ఇక్కడే బస చేస్తుంటారు.

అయితే.. హనియా బస చేసిన గెస్ట్‌హౌస్‌లో రహస్యంగా రెండు నెలల క్రితమే మందుపాతరను దాచి ఉంచారని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక సంచలన విషయాన్ని బయటపెట్టింది. హనియా తరచూ బస చేసే గెస్ట్‌హౌస్‌ కావడంతో పథకం ప్రకారం అందులో బాంబు పెట్టారని, హనియా అక్కడ ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో బాంబును పేల్చివేశారని అధికారవర్గాలు చెప్పినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ఈ ఘటనలో హనియాతోపాటు ఆయన బాడీగార్డ్‌ కూడా చనిపోయాడు. పేలుడు ధాటికి గెస్ట్‌హౌస్‌ భవంతి కంపించిపోయిందని, అద్దాలు పగిలిపోవడంతోపాటు.. బయటి గోడ పాక్షికంగా కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. లెబనాన్‌లోని బీరుట్‌పై జరిపిన వైమానిక దాడిలో హమాస్‌ మిత్రపక్షం హెజ్బొల్లా మిలిటరీ కమాండర్‌ ఫాయద్‌ షుకుర్‌ను హత్య చేసిన కొద్దిగంటల తర్వాత హనియా హత్య జరిగింది.

ఘటన జరిగిన వెంటనే ఇజ్రాయెల్‌ దళాలు గెస్ట్‌హౌస్‌పై క్షిపణిని ప్రయోగించాయని అంతా భావించారు. అయితే.. కొన్ని వారాలపాటు రహస్యంగా ఉంచిన బాంబు పేలడంతోనే ఆయన చనిపోయారని చివరకు తేలింది. తీవ్ర భద్రతాలోపాన్ని వాడుకున్న ప్రత్యర్థులు పథకం ప్రకారం ముందే బాంబును అక్కడ పెట్టడం ఆయన ప్రాణాలను బలిగొన్నది.

ఈ హత్యకు తమదే బాధ్యతని ఇజ్రాయెల్‌ ప్రకటించలేదు. అయితే.. ఈ ఆపరేషన్‌పై అమెరికా, ఇతర పశ్చిమదేశాల ప్రభుత్వాలకు ఇజ్రాయెల్‌ నిఘా విభాగం అధికారులు వివరించారని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. కానీ.. హత్యోదంతంపై తమకు ముందుగా సమాచారం ఏమీ లేదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లిన్‌కెన్‌ చెబుతున్నారు.

హనియా భౌతికకాయానికి గురువారం టెహరాన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆ కార్యక్రమంలో వేల మంది పాల్గొని, తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. ఇరాన్‌ సుప్రీం నేత అయొతుల్లా అలీ ఖమేనీ అక్కడ ప్రార్థనలకు నాయకత్వం వహించారు. ఈ హత్యకు తీవ్ర శిక్ష ఉంటుందని ఆయన అంతకు ముందే ప్రకటించారు. శుక్రవారం ఖతార్‌లో హనియా అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ అరబ్‌, ఇస్లామిక్‌ దేశాధినేతలు, పాలస్తీనా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.