World War 3 | ఇజ్రాయెల్​తో నేరుగా యుద్ధంలోకి ఇరాన్​ – టెల్​అవీవ్​పైకి క్షిపణులు

కొద్దిసేపటి క్రితం ఇరాన్​, ఇజ్రాయెల్​పై నేరుగా క్షిపణి దాడి చేసింది. దీంతో ఇరుదేశాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినట్లే. దీంతో మధ్యప్రాచ్యమం​తా యుద్ధభయంలో మునిగిపోయింది.

World War 3 | ఇజ్రాయెల్​తో నేరుగా యుద్ధంలోకి ఇరాన్​ – టెల్​అవీవ్​పైకి క్షిపణులు

ఊహించినట్లే కొద్ది సేపటి క్రితం ఇరాన్​(Iran) ఇజ్రాయెల్​(Israel)పై నేరుగా దాడికి దిగింది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటల 8 నిమిషాల(10.08 pm IST)కు ఇజ్రాయెల్​ రాజధాని టెల్​అవీవ్(Tel Aviv)​పై క్షిపణులతో దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్​ ప్రభుత్వం తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా సూచించింది. టెల్​అవీవ్​లో నిరంతరాయంగా సైరన్లు మోగుతున్నాయి. ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఉన్న బాంబ్​ షెల్టర్ల(Bomb Shelters)లోకి వెళ్లాల్సిందిగా సత్వర ఆదేశాలు జారీ చేసింది.

బీరూట్​లోని భూగర్భ రహస్య స్థావరంలో చర్చలు జరుపుతున్న హెజ్బుల్లా(Hezbullah) అధినేత హసన్​ నస్రల్లా(Hassan Nasrallah)పై ఇజ్రాయెల్​ ఫైటర్​ జెట్లు బంకర్​ బస్టర్​ బాంబులు కురిపించి  హతమార్చింది. ఈ ఘటనలో ఇరాన్​ రివల్యూషనరీ గార్డ్స్​(IRG)కు చెందిన అత్యున్నత అధికారి ఒకరు కూడా మృతి చెందినట్లు సమాచారం. దీంతో తమ సుప్రీం ఖమేనీ(Ayatollah Ali Khamenei)ని  హుటాహుటిన రహస్య ప్రదేశానికి తరలించిన ఇరాన్​ యుద్ధ ప్రకటనలు చేస్తూనేఉంది. ఇజ్రాయెల్​ లెబనాన్​(Lebanon)లోని హెజ్బుల్​ స్థావరాలపై భూతల దాడులు ప్రారంభించిన వేళ, ఇరాన్​ కాసేపటి క్రితం ఇజ్రాయెల్​పై యుద్ధం ప్రకటించింది.

ఇజ్రాయెల్​ విదేశాంగ శాఖ, ఐడిఎఫ్​(IDF)ను ఉటంకిస్తూ, ఈ రాత్రి 10.08 ని.లకు ఇరాన్​ తమపై క్షిపణి దాడి చేసిందని ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్​ అధికార వార్తాసంస్థ ఐఆర్​ఎన్​ఏ(IRNA) కూడా ధృవీకరించింది. తాము టెల్​ అవీవ్​పై దాడి చేసినట్లు ప్రకటించింది. రాయటర్స్​ వార్తా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం దాదాపు 100 క్షిపణులను ఇజ్రాయెల్​పై ఇరాన్​ ప్రయోగించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, ఇరాన్​ దాడిని గుర్తించిన వెంటనే ఇజ్రాయెల్​ తన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, బాంబ్​ షెల్టర్లకు తరలించాల్సిందిగా ఆదేశించింది. ఇవే ఆదేశాలను ఇజ్రాయెల్​ ప్రభుత్వ శాఖలు తమ సోషల్​ మీడియా ఖాతాల్లో కూడా పోస్ట్​ చేసాయి.

అంతకుముందే, టెల్​ అవీవ్​లో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడగా, నలుగురు ఇజ్రాయెల్​ పౌరులు మృతి చెందారు. దుండగులిరువురిని పోలీసులు కాల్చిచంపారు.

Tags: