Viral Video | విదేశాల్లో చదువు అంటే ఆకర్షణీయమైన భవిష్యత్తు, మంచి అవకాశాలు ఎదురుగా వస్తాయనే భావన చాలామందిలో ఉంది. కానీ అది అంత సులువు కాదని తెలుస్తోంది. అమెరికాలో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి తన ఒంటరి జీవితం, అక్కడ తాను ఎదుర్కొంటున్న సవాళ్లపై పంచుకున్న వీడియో ఇదే విషయాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
కనవ్ అనే భారతీయ విద్యార్థి విదేశాల్లో ఒంటరిగా జీవించడం ఎంత కష్టమో వివరిస్తూ సోషల్‌మీడియాలో ఒక వీడియో పెట్టాడు. అందులో.. 19 ఏళ్ల వయసులోనే భారత్ నుంచి అమెరికాకు వచ్చి చదువుకుంటున్నానని తెలిపాడు. ఇక్కడ జీవితం బయటకు కనిపించేంత సులువు కాదన చెప్పాడు. విదేశాల్లో చదువుకుంటూ జీవితం నిర్వహించడం పెద్ద సవాలుగా మారుతుందని అన్నాడు.
మన స్టైల్ ఆహారాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఖర్చులను నియంత్రించుకోవడం, క్రెడిట్ కార్డులు, ట్యాక్స్ వ్యవహారాలు చూసుకోవడం వంటి అన్ని పనులను మనమే స్వయంగా నిర్వహించాల్సి ఉంటుందని ఆ వీడియోలో కనవ్ తెలిపాడు. అలాగే స్కూల్ విద్యతో పోలిస్తే కాలేజీ విద్య పూర్తిగా భిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. అమెరికాలోని సంస్కృతి, ప్రజల ఆచార వ్యవహారాలు అన్నీ కొత్తగా అనిపిస్తాయని.. వాటికి అలవాటు పడటం అంత సులువు కాదని చెప్పాడు.
ముఖ్యంగా పండుగల సమయంలో ఇంటి జ్ఞాపకాలు మరింత వేధిస్తాయని కనవ్ తెలిపాడు. ఇంట్లో అందరూ కలిసి సంబరాలు చేసుకుంటే.. మనం మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో వీడియో కాల్స్ ద్వారా మాత్రమే చూస్తూ ఆనందించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ కష్టాలే వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడతాయని అతను అభిప్రాయపడ్డాడు. ఇవన్నీ కొద్దిరోజులు కఠినంగా అనిపించినప్పటికీ.. ఆ అనుభవాలే మనల్ని దృఢంగా మారుస్తాయని.. స్వతంత్రంగా నిలబడటం నేర్పిస్తాయని వివరించాడు. తన ఈ ప్రయాణం కేవలం చదువు నేర్చుకోవడానికి మాత్రమే కాదని.. తనను తాను నిర్మించునే ప్రక్రియగా అతను అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో చదవాలని కలలు కంటున్న యువత ఈ వాస్తవాలను కూడా తెలుసుకోవాల్సిన అభిప్రాయం ఉందని సలహా ఇచ్చాడు.
Read More:
ఉద్యోగం రాక అమెరికాలో ఆంధ్రా యువకుడి ఆత్మహత్య.. మృతదేహం కోసం కుటుంబం ఎదురుచూపులు
Viral News | ఉద్యోగం ఇవ్వలేదని.. కంపెనీలు సర్వనాశనం కావాలని తాంత్రిక పూజలు!
