Khawaja Asif | పిజా హ‌ట్‌ ఓపెన్ చేసి నవ్వులపాలైన పాక్‌ మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

సియాల్‌కోట్‌లో ఫేక్ పిజా హట్ ఔట్‌లెట్‌ను ప్రారంభించి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నెట్టింట నవ్వులపాలయ్యారు. తమ ఔట్‌లెట్ కాదని పిజా హట్ స్పష్టం చేయడంతో మీమ్స్ వెల్లువెత్తాయి.

Khawaja Asif | పిజా హ‌ట్‌ ఓపెన్ చేసి నవ్వులపాలైన పాక్‌ మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

దాయాది పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన అధికారులు తమ చేష్టలు, మాటలతో నిత్యం విమర్శలపాలవుతూనే ఉంటారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ (Khawaja Asif) మరోసారి నవ్వులపాలయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

సియాల్‌కోట్ (Sialkot) కంటోన్మెంట్ ఏరియాలో అమెరికాకు చెందిన ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పిజాహట్ (Pizza Hut) ఔట్‌లెట్‌ ఓపెన్‌ అయ్యింది. ఈ ఔట్‌లెట్‌ను ఏకంగా పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ గ్రాండ్‌గా రిబ్బన్‌ కట్‌ చేసి ఓపెన్‌ చేశారు. అమెరికాకు చెందిన పిజా హ‌ట్ ఫుడ్ కంపెనీ త‌న స్టోర్‌ను పాకిస్థాన్‌లో ఓపెన్ చేస్తున్నట్లు అక్కడ హంగామా సృష్టించారు. స్థానిక అధికారులతో కలిసి అక్కడ ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అదేంటంటే..? అసలు సియాల్‌కోట్‌లో పిజా హట్‌ ఓపెన్‌ అయినట్లు ఆ సంస్థకే తెలియకపోవడం. ఖవాజా ఆసిఫ్‌ ఓపెన్‌ చేసింది ఫేక్‌ పిజా హట్‌ అని తేలింది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫొటోలు, వీడియోలపై పిజా హట్ స్పందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సియాల్ కోట్‌లో తమ సంస్థ ఔట్ లెట్ ప్రారంభించలేదని, వైరల్‌గా మారిన ఔట్ లెట్ ఫేక్ అని ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో పాక్‌ రక్షణ మంత్రిపై నెట్టింట మీమ్స్‌ పేలుతున్నాయి. ‘మీరెక్కడి రక్షణ మంత్రి..?’, ‘వెనకా ముందు ఆలోచించకుండా అలా ఎలా ప్రారంభిస్తారు’ , ‘ఇలాంటివి కేవలం పాకిస్థాన్ లో మాత్రమే సాధ్యం’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ పాక్‌ రక్షణ మంత్రిని ఏకిపారేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

District Reorganization | జిల్లాల పునర్వ్యస్థీకరణకు జనగణన బ్రేక్‌!
Emmanuel Macron | ట్రంప్‌తో వివాదం వేళ.. దావోస్ సదస్సు వేదికపై సన్‌గ్లాసెస్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. నెట్టింట చర్చ