District Reorganization | జిల్లాల పునర్వ్యస్థీకరణకు జనగణన బ్రేక్‌!

తెలంగాణలో జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెబుతున్నా.. 2027లో నిర్వహించేబోయే దేశవ్యాప్త జనగణన నేపథ్యంలో ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్లే అవకాశాలు లేవని చెబుతున్నారు.

District Reorganization | జిల్లాల పునర్వ్యస్థీకరణకు జనగణన బ్రేక్‌!
  • భౌగోళిక సరిహద్దులపై కేంద్రం నిర్ణ‌యం
  • ఏడాదిన్నర వరకు ఎదురు చూపులే

విధాత, హైదరాబాద్:
District Reorganization | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ చేస్తామ‌ని ప్రతిపక్ష నేత హోదాలో రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ళు అయినా ఉలుకూ ప‌లుకూ లేదు. ఈ నెల 12వ తేదీన సచివాలయంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ కోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జ‌డ్జ్‌తో క‌మిష‌న్ వేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ముఖ్య‌మంత్రి చేసిన ‘క‌మిష‌న్ ప్ర‌క‌ట‌న’ కార్యరూపం దాల్చ‌వ‌చ్చునేమో కానీ.. జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ మాత్రం ఇప్ప‌ట్లో సాధ్యం కాక‌పోవ‌చ్చున‌నే వ్యాఖ్య‌లు విన్పిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భౌగోళికంగా జిల్లాల స‌రిహ‌ద్దుల మార్పులు, చేర్పుల‌ను స్థంభింపచేసింది. దీంతో జ‌న గ‌ణ‌న – 2027 ప్ర‌క్రియ‌ పూర్త‌యిన త‌రువాతే జిల్లాలు, మండ‌లాలు, గ్రామాల‌ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ప్రారంభించాల్సి ఉంటుంది.

గత ప్రభుత్వంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న కే చంద్ర‌శేఖ‌ర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల‌ను 33 జిల్లాలుగా 2016లో విభ‌జించిన విష‌యం తెలిసిందే. అడ‌గ‌నివారిదే త‌ప్ప‌న్న‌ట్లుగా ఒక అసెంబ్లీ నియోజ‌క‌వర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటించేశారు. దీంతో పాటు రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాల‌ను కూడా కొత్త‌గా ఏర్పాటు చేశారు. శాస్త్రీయ విధానంలో జిల్లాలు, మండ‌లాల విభ‌జ‌న జ‌ర‌గ‌లేద‌ని అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏపీ, తెలంగాణ స‌రిహ‌ద్దులో ఉన్న వ‌న‌ప‌ర్తి కేంద్రంగా జిల్లా ప్ర‌క‌టించడంపై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. త‌న కుమారుడు కేటీఆర్ కోసం సిరిసిల్లను జిల్లాగా ప్ర‌క‌టించారన్న విమర్శలూ వచ్చాయి. చిన్న రాష్ట్రంలో 33 జిల్లాల అవ‌స‌రం లేద‌ని ప‌లువురు ఆనాడే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అశాస్త్రీయ ప‌ద్ద‌తిలో, కొంద‌రిని సంతృప్త‌ప‌రిచేందుకు జిల్లాల విభజన తంతు సాగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్క ఖ‌మ్మం జిల్లాను మాత్ర‌మే రెండుగా విభ‌జించి న్యాయం చేశారంటున్నారు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జిల్లాల క‌లెక్ట‌ర్ల హోదా.. తాసిల్దారుకు ఎక్కువ.. ఆర్డీవోకు తక్కువ అన్న తీరులో ఉంది. వ‌రంగ‌ల్ జిల్లాను ఏకంగా ఐదు ముక్కలు చేసేశారు. కాక‌తీయ తోర‌ణం ఒక జిల్లాలో, రామ‌ప్ప ఆలయం మ‌రో జిల్లాలో, వేయి స్థంభాల గుడి మ‌రో జిల్లాకు వెళ్లేలా ఉమ్మడి జిల్లాను కోసిపారేశారు. గ‌తంలో ఇవ‌న్నీ వ‌రంగ‌ల్ జిల్లాలో ఉన్నాయ‌ని ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి గ‌తవారం జ‌రిగిన ఒక స‌భ‌లో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. త‌లా తోక లేకుండా గ‌త బీఆర్ ఎస్ పాల‌కులు వ్య‌వ‌హ‌రించార‌ని కూడా ఆయ‌న‌ విమ‌ర్శించారు. ఇలాంటి త‌ప్పిదాల‌ను స‌రిదిద్ది, జిల్లాల‌కు ఒక రూపం వ‌చ్చేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇలా ప‌లు జిల్లాల్లో ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి ఒత్తిడి ఉంది.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి నేతృత్వంలో క‌మిష‌న్ వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ క‌మిష‌న్‌లో ప‌రిపాల‌నా రంగంలో నిపుణులైన వారిని స‌భ్యులుగా నియ‌మించే అవకాశాలు ఉన్నాయి. క‌మిష‌న్ సభ్యులు జిల్లాల్లో ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు, అభ్యంత‌రాలు సేకరిస్తారు. వాటిని క్రోడీకరిస్తూ ఒక నివేదికను ప్రభుత్వానికి కమిషన్‌ సమర్పిస్తుంది. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. కానీ.. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌ మేరకు జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ఇప్ప‌ట్లో ఆచ‌ర‌ణ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. దీనికి కనీసం మ‌రో ఏడాదిన్న‌ర‌ కాలం పాటు ఆగాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

 ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త! టీజీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్ ఏర్పాటు యత్నాల్లో సర్కార్‌?

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప‌రిధిలో జ‌న గ‌ణ‌న విభాగం ఉంది. జ‌న గ‌ణ‌న –2027లో కుల గ‌ణ‌న కూడా ఉండ‌టంతో గ‌త ఏడాది (2025) డిసెంబ‌ర్ 31వ తేదీన ప‌రిపాల‌నా స‌రిహ‌ద్దుల్లో మార్పుచేర్పులను కేంద్రం నిలిపివేసింది. జన గణన అనేది దేశంలో అత్యంత ప్రాముఖ్య‌మైన కార్య‌క్ర‌మం కావ‌డంతో అది పూర్త‌య్యే వ‌ర‌కు మార్పులు చేర్పులు సాధ్యం కాదు. ఇదే విషయాన్ని జ‌న గ‌ణ‌న క‌మిష‌న‌ర్‌, రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు పంపించిన‌ స‌ర్క్యూల‌ర్‌లో స్ప‌ష్టం చేశారు. జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌, మార్పులు, చేర్పులు, కొత్త మండ‌లాల ఏర్పాటు, కొన్నింటిని క‌ల‌ప‌డం, కొన్ని గ్రామాల‌ను విడ‌దీయడం, క‌ల‌ప‌డం, కొత్త రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు చేయ‌డం, విడ‌దీయ‌డం, స‌రిహ‌ద్దుల‌ను మార్చ‌డం వంటి ప్ర‌క్రియ‌ను 2025 డిసెంబ‌ర్ 31వ తేదీ నుంచి నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పేర్ల‌లో అక్ష‌ర దోషాల‌ను స‌రిచేయ‌డం కూడా అనుమ‌తించ‌డం లేద‌ని క‌మిష‌న‌ర్ ఆ సర్క్యులర్‌లో తేల్చి చెప్పేశారు.

నోటిఫికేషన్ ప్ర‌కారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌ర్ నెల వ‌ర‌కు ఇంటింటికి తిరిగి వివ‌రాలు న‌మోదు చేసే తొలి ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రెండో ద‌శ‌లో 2027 ఫిబ్ర‌వ‌రి నుంచి జ‌న గ‌ణ‌న ప్రారంభ‌మ‌వుతుంది.

వాస్త‌వానికి జ‌న గ‌ణ‌న‌కు 2019లోనే ఏర్పాట్లు చేసిన‌ప్ప‌టికీ కోవిడ్ కార‌ణంగా 2021కు వాయిదా ప‌డింది. జ‌న గ‌ణ‌న –2027 ఉన్నందున స‌రిహ‌ద్దుల మార్పులు, చేర్పులు ఏమైనా ఉన్న‌ట్ల‌యితే 2025 జూలై 1వ తేదీ క‌ల్లా తెలియ‌చేయాల‌ని, మ్యాపులతోపాటు పూర్తి వివ‌రాల‌ను 2025 డిసెంబ‌ర్ 31వ తేదీ స‌మ‌ర్పించాల‌ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు స‌మాచారం పంపించారు. ఈ గ‌డువు ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వ జిల్లాల పున‌ర్వ్యిభ‌జ‌న, పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌పై వివ‌రాలు, మ్యాపులను పంపించ‌లేక‌పోయింది. దీంతో జ‌న గ‌ణ‌న ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాతే ఈ ప‌నికి శ్రీకారం చుట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ లోగా క‌మిష‌న్ ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు, అభిప్రాయాలు స్వీక‌రించి నివేదిక త‌యారు చేయిస్తారా? లేదా? అనేది ముఖ్య‌మంత్రి నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంది.

Red Also |

12 Lane Greenfield Expressway | ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?
Telangana Advisors System| క్యాబినెట్ పరిమాణంపై పరిమితులు.. దొడ్డిదోవన సలహాదారుల పేరిట పందేరం.. సేవ కోసమా? ప్రాపకం కోసమా?
Biscuits | బిస్కెట్లపై రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!