Telangana District Reorganisation | జిల్లాల పునర్వ్యవస్థీకరణ లోపాలను సవరిస్తాం : పొంగులేటి
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న ప్రచారాలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. కొత్త జిల్లాలు లేవని, గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను మాత్రమే సరిదిద్దుతామని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త రెవెన్యూ డివిజన్లపై కేబినెట్‌లో చర్చ జరుగుతుందని వెల్లడించారు.
Telangana District Reorganisation: Govt to Fix BRS Lapses, No New Districts
- జిల్లాలు, మండలాల సంఖ్యలో మార్పు లేదు
- 11 కొత్త రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదన
- జిల్లాలు, మండలాల సరిహద్దులు మారతాయి
- శాసనసభలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటన
విధాత తెలంగాణ డెస్క్ | హైదరాబాద్:
Telangana District Reorganisation | తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న ఊహాగానాలు, ప్రచారాలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో తెరదించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో జరిగిన లోపాల వల్ల పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ, వాటిని సరిదిద్దడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 661 మండలాల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చిచెప్పారు.
ప్రశ్నోత్తరాల సమయంలో స్పందించిన మంత్రి, కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నామన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. కొంతమంది స్వార్థపూరిత శక్తులు ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాధ్యతా అధ్యయనం() లేకుండా జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం వల్ల అవి చెల్లాచెదురుగా మారాయని తెలిపారు.
అస్తవ్యస్థ పునర్విభజన వల్ల పరిపాలనలో సమస్యలు

గత పునర్వ్యవస్థీకరణ వల్ల కొన్ని రెవెన్యూ డివిజన్లు ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించాయని మంత్రి వివరించారు. ఇల్లందు రెవెన్యూ డివిజన్ నాలుగు నియోజకవర్గాల్లో విస్తరించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల కోసం అధికారులను సకాలంలో సంప్రదించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
అలాగే, రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన రెండు రెవెన్యూ డివిజన్లు, 31 మండలాలకు సరైన కార్యాలయాలు, సిబ్బంది కేటాయించకపోవడం పరిపాలనా లోపాలకు దారి తీసిందని తెలిపారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్తగా 11 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు.
కొత్త రెవెన్యూ డివిజన్లపై కేబినెట్ నిర్ణయం
ఇప్పటికే నాలుగు రెవెన్యూ డివిజన్లకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్టు మంత్రి వెల్లడించారు. మరో ఆరు జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు కోరగా, ఒక ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించి, ఆయా ప్రాంతాల నుంచి సాధ్యతా నివేదికలు తీసుకుంటామని తెలిపారు.
ఈ అంశాన్ని రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి, పరిపాలనకు అనుకూలంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ నేపథ్యంలో మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునఃపరిశీలన కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram