ఇజ్రాయెల్, హమాస్ దళాల మధ్య భీకర పోరు.. 500 మందికి పైగా మృతి

- దీర్ఘకాల పోరాటానికి సిద్ధమయ్యామని నెతన్యాహు ప్రకటన
- ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాలని పాలస్తీనియన్లకు హెచ్చరిక
విధాత: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య పోరు భీకరంగా కొనసాగుతోంది. ఈ పోరులో ఇప్పటి వరకు ఇరు వైపులా కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో తాము దీర్ఘకాల, సంక్లిష్ట యుద్ధానికి సిద్ధమయ్యామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు.
గాజా, హమాస్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న పాలస్తీనియన్లను ఆయన హెచ్చరించారు. తమ సైన్యం భీకరంగా అన్ని ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చి దుండగులను మట్టుపెడుతుందని, కాబట్టి ప్రాణాలు కావాలనుకున్నవారు పారిపోవాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ముందుగా హమాస్ దళాలు నేల, నింగి, సముద్రం నుంచి రాకెట్లను ప్రయోగించాయి. దీంతో యుద్ధానికి ఆహ్వానం పలికినట్లైంది.
ఈగల మూకలా తమ దేశం మీదకు దూసుకొచ్చిన ఈ రాకెట్ల వల్ల కనీసం 300 మంది చనిపోయారని, 1000 మంది పౌరులకు గాయాలయ్యాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల తమ వైపు 232 మంది కన్నుమూశారని, 1700 మంది క్షతగాత్రులయ్యారని పాలస్తీనా ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ నగరాల్లోకి దూసుకొచ్చి హమాస్ దళాలు పౌరుల ఇళ్లపైకి కాల్పులు జరుపుతున్నాయని, వాటితో తమ సైనికులు పోరాడుతున్నారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఇజ్రాయెల్ పౌరుల్ని, సైనికులను అపహరిస్తుండటం హమాస్ దళాలు ఆ దేశాన్ని కలవరపెడుతోంది. వారిని బంధీలుగా తీసుకుంటున్న దృశ్యాలను విడుదల చేయడం ద్వారా ఇజ్రాయెల్ దళాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు హమాస్ ప్రయత్నిస్తోంది. గాజాకు దగ్గర్లోని స్డెటార్ నగరంలో పౌరుల మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నట్లు కొన్ని వీడియోల్లో కనిపిస్తోంది.
మరోవైపు ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో చర్చించడానికి ఐరాస భద్రతా మండలి ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇజ్రాయెల్‌కు తాము తిరుగులేని మద్దతు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ప్రకటించగా.. భారత ప్రధాని మోదీ, ఇతర యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతును తెలియజేశాయి.