Controlled Alcohol Sales : 73 ఏళ్ల తర్వాత అక్కడ మద్యపానంపై నిషేధం ఎత్తివేత! కానీ.. దానిపై మాత్రం లేదు!

Controlled Alcohol Sales : 73 ఏళ్ల తర్వాత అక్కడ మద్యపానంపై నిషేధం ఎత్తివేత! కానీ.. దానిపై మాత్రం లేదు!

Controlled Alcohol Sales : సౌదీ అరేబియా తరచూ వార్తల్లోనే ఉంటుంది. ఏదో ఒక విశేషం.. లేదా భారీ కట్టడం, మానవులకు సాధ్యమేనా? అనిపించే నిర్మాణాలు.. ఇలా ఏదో ఒక ప్రత్యేకతను చాటుతూనే ఉంటుంది. తాజాగా కింగ్‌డమ్‌ ఆఫ్‌ సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోనే కాదు.. ఆ దేశానికి పర్యాటకులుగా వెళ్లేవారికి సైతం ఊరటనిచ్చే ఆ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సౌదీ అరేబియా ముస్లిం దేశం. అక్కడ మద్యపానం నిషేధం. ఈ నిషేధం ఇప్పటిది కాదు..  73 ఏళ్లుగా మద్యపానం అమ్మకాలు, వినియోగంపై  నిషేధం కొనసాగుతున్నది. అయితే.. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. మద్యం విక్రయాల కోసం కఠినమైన లైసెన్సింగ్‌ వ్యవస్థను 2026 నాటికి తీసుకురానున్నది. రానున్న కొన్నేండ్లలో సౌదీ అరేబియా పలు అంతర్జాతీయ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్నది. రియాద్‌ ఎక్స్‌పో 2030, ఫిఫా వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌ 2034లో నిర్వహించనున్నారు. వీటికి సన్నద్ధమయ్యే క్రమంలోనే ఈ కీలక విధానపరమ మార్పు చోటుచేసుకోనున్నది. సౌదీ అరేబియాలో 1952 నుంచి మద్యపాన నిషేధం అమల్లో ఉన్నది. దేశంలోని ప్రజలే కాకుండా విదేశీయులకు సైతం ఇక్కడ మద్యం తాగడం నిషిద్ధం. అయితే.. 2024 జనవరి నుంచి రియాద్‌లోని ఒక షాపులో ముస్లిమేతర దౌత్యవేత్తలకు అందులోనూ కఠిన నిబంధనలతో మద్యం విక్రయించేందుకు ఒక షాప్‌ ఏర్పాటు చేశారు.

కొత్త విధానంలో సౌదీ అరేబియా కింగ్‌డమ్‌లో ఎంపిక చేసిన 600 ప్రదేశాల్లో కంట్రోల్డ్‌ ఆల్కహాల్‌ సేల్స్‌ ఉంటుందని సౌదీ మూమెంట్స్‌ ఒక కథనంలో పేర్కొన్నది. వీటిలో ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, ఎన్‌ఈవోఎం, సిందలా ఐలాండ్‌, రెడ్‌ సీ ప్రాజెక్ట్‌ వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటిలో బీర్‌, వైన్‌, సిడెర్‌ వంటి బేవరేజెస్‌ విక్రయిస్తారు. కానీ.. ఇక్కడే అసలు తిరకాసు ఉన్నది. 20 శాతానికి మించి ఆల్కహాల్‌ కలిగి ఉండే స్పిరిట్స్‌ మాత్రం విక్రయం, సరఫరా ఉండదు. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు, ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే మద్యం లభిస్తుంది. బహిరంగ ప్రదేశాలు, ప్రైవేటు నివాస ప్రాంతాలు, రిటైల్‌ అవుట్‌లెట్లలో లభించదు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఏర్పాటు చేసే విక్రయ కేంద్రాల్లో సైతం కఠిన నియంత్రణలు ఉంటాయి. బాగా శిక్షణ పొందిన, లైసెన్స్‌ పొందిన స్టాఫ్‌ వాటిలో ఉంటారు. మద్యం పాలసీని తు.చ. తప్పకుండా అమలు చేసేలా వీరు చూస్తారు. ఇదే తరహాలో యూఏఈ, బహ్రెయిన్‌ దేశాల్లో మద్యం విక్రయాలు విజయవంతమయిన విషయాన్ని సౌదీ అధికారులు గుర్తు చేస్తున్నారు.