షాంఘై, ఆగస్టు 29: ఏడు సంవత్సరాల మౌనం తర్వాత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒకే వేదికపై ముఖాముఖి భేటీ కానున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా జరగనున్న ఈ సమావేశం, రెండు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలకు కొత్త ఊపునిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సరిహద్దు ఉద్రిక్తతల చరిత్ర
గత దశాబ్దంలో భారత్–చైనా మధ్య పలు సార్లు సరిహద్దు వివాదాలు తలెత్తాయి. 2017 డొక్లాం, 2020 గాల్వాన్ ఘటనల తర్వాత రెండు దేశాల మధ్య విశ్వాసం తీవ్రంగా దెబ్బతిన్నది. వాణిజ్య పరంగా కూడా చైనా ఉత్పత్తులపై భారత్ పలు పరిమితులు విధించింది. ఫలితంగా సంబంధాలు బలహీనపడుతూ వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించడం, ఆసియాలో కొత్త వ్యూహాత్మక సమీకరణలు చోటుచేసుకోవడం వల్ల భారత్–చైనా మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ భేటీ ద్వారా వాణిజ్యం, ఇంధనం, భద్రతా రంగాల్లో కొత్త చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
SCO వేదిక ప్రాముఖ్యం
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వేదికపై మోదీ–షీ కలవడం కేవలం ద్వైపాక్షికంగానే కాకుండా ప్రాంతీయ స్థాయిలోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా, పాకిస్థాన్, మధ్య ఆసియా దేశాల సమక్షంలో జరగబోయే ఈ చర్చలు ఆసియా–ప్రశాంత ప్రాంత సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. భారత్‌కు బద్ధశత్రువైన పాకిస్థాన్, ఆత్మీయ మిత్రదేశమైన రష్యా, రెండూ ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. నిజానికి ఈ సమావేశం భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యం కూడా. చైనాతో సంబంధాలను విషయాల వారీగా వేర్వేరుగా పరిశీలించాలని భారత్ భావన. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, భారత్ ‘ఆక్ట్ ఈస్ట్ పాలసీ’ ఒకే భౌగోళిక పరిధిలో పోటీ పడుతున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక ఒత్తిళ్ల మధ్య రెండు దేశాలు కనీసం వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై దృష్టి పెట్టే అవకాశముంది. ఈ పరిణామం ద్వారా సరిహద్దు శాంతి, ఆర్థిక లావాదేవీలకు కొత్త దారులు తెరవవచ్చని నిపుణుల అంచనా.
మోదీ–షీ సమావేశం తక్షణ ఫలితాలను ఇవ్వకపోయినా, రెండు దేశాల మధ్య ఘనీభవించిన బంధాలను మళ్లీ కొత్త ఊపుతో సడలించే ప్రయత్నంగా ఇది పరిగణించబడుతోంది. ఆసియా ఖండంలో శాంతి, స్థిరత్వం కోరుకునే దేశాలకు ఇది సానుకూల సంకేతం. అమెరికా అధ్యక్షుడి వింత చేష్టలతో న్యూఢిల్లీ, బీజింగ్‌కు దగ్గర కావాలనుకుంటుందనీ, అదే సమయంలో చైనాకు కూడా ఇది అనుకూలమైన విషయమే. భారత్‌కు మంచి భాగస్వామిగా ఉండటం, అమెరికాను దెబ్బకొట్టినట్లేనని బీజింగ్ ఫీలింగ్.