ఈ కాలం చిన్నారులకు గొల్లభామలు.. మిణుగురు పురుగుల గురించి తెలుసా?

మిణుగురు పురుగులు, గొల్లభామలు, భారీ ఈగలు… ఇలా కీటకాల్లో (Insects) వైవిధ్యభరితమైన జీవుల్ని మన బాల్యంలో చూసే ఉంటాం. భలే ఉన్నాయే అనుకుని పట్టుకోకబోతే.. అవి తప్పించుకుని రెప్పపాటులో ఎగిరిపోవడాన్ని చూసి అబ్బురపడినవాళ్లమే. అయితే ఆ జ్ఞాపకాలు ఇప్పటి తరానికి అందడం లేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో పెరిగే చిన్నారులకు ఆ నగర మిరుమిట్లలో మిణుగురు పురుగు మెరుపులు కనిపించే అవకాశమే ఉండదని చెప్పారు.
అంతే కాకుండా క్షీణిస్తున్న వాటి సంఖ్య కూడా దీనికి మరో కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2022లో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిలో వీటి తరుగుదల రేటు ఏడాదికి రెండు శాతంపైగానే నమోదవుతోందని తేలింది. భారత్‌లో కూడా పరిస్థితి అదే విధంగా ఉందని ఇక్కడి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ మార్పులు, వాటి నివాస స్థలాలు కుచించుకుపోవడం, విపరీతంగా పురుగు మందులు వాడటం, కృత్రిమ వెలుగుల కాలుష్యం మొదలైనవి కీటకాల పట్ల ప్రతికూలంగా మారాయని చెబుతున్నారు.
కేవలం భారత్‌లోని పరిస్థితులపై 2020లో జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ ఎస్ ఐ) చేసిన పరిశోధనలో.. హిమాలయాల వద్ద ఉష్ణోగ్రతలు పెరగడంతో.. ఆ పర్వత ప్రాంతాల్లో సంచరించే కీటకాలు.. చల్లని వాతావరణం కోసం పర్వత శిఖరాగ్రాల పైకి వెళ్లిపోయాయని గమనించారు. భారత్‌లో కీటకాల సంఖ్య బాగా తగ్గుతోంది. వీటిపై పరిశోధనలు చేసే వారిని ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. దీనికి నిదర్శనం ఏమిటంటే ఇప్పటికే చాలా చోట్ల కీటకాలను తరిమిగొట్టే స్ప్రేలను మనం వాడటం మానేశాం అని నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్స్ ప్రొఫెసర్ సంజయ్ సానే పేర్కొన్నారు.
అమెరికా, యూకే తరహాలో కీటకాల పరిస్థితిపై మన దేశంలో సమాచారం లేకపోవడం. శాస్త్రవేత్తలకు పెద్ద అవరోధంలా మారింది. తాజాగా దిల్లీలో ఉన్న ఏడు పార్కుల్లో కీటకాల గణన చేపట్టగా వాటిల్లోని నాలుగు పార్కుల్లోపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాటి సంఖ్య బాగా పడిపోయినట్లు వెల్లడికావడం తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఇవి లేకపోతే మనకేంటి నష్టం అనుకోవచ్చు గానీ.. విత్తనాలు భూమిపై పడి పంటలు పండటంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. వీటి జనాభా క్షీణిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదముంది.